
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
● 10న ఉపాధి హామీ సిబ్బందితో
రాష్ట్రస్థాయి కార్యక్రమం
● కొనసాగుతున్న యోగా శిక్షణ
విజయనగరం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి, వారి చేత యోగాసనాలను అభ్యసింపజేసే ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన వందమంది మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ రెండో రోజు ఆదివారం రాజీవ్‌ఇండోర్ స్టేడియంలో కొనసాగింది. జిల్లా కేంద్రంలో ప్రత్యక్షంగా, హాజరుకాని వారికి ఆన్‌లైన్ ద్వారా శిక్షణ నిర్వహించారు. యోగా గురువులు, టీవోటీలు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొన్నారు.
నాలుగు ప్రాంతాల్లో ప్రదర్శనలు
జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 30న రామనారాయణం, జూన్ 6న చింతపల్లి బీచ్ వద్ద, 12న రామతీర్థం వద్ద, 19న శ్రీ గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ వద్ద యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్‌ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్కర్లతో జూన్ 10న యోగా ప్రదర్శన నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయనగరంలో 10 ప్రాంతాల్లో..
జిల్లా కేంద్రం విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పది యోగా వీధులను ఎంపిక చేశారు. రెండు రోజులకు ఒకసారి పట్టణంలోని ఏదో ఒక ప్రధాన మార్గంలో ఉదయాన్నే యోగాసన ప్రదర్శన నిర్వహిస్తారు. శిక్షణ పొందినవారితో పాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్‌కు వచ్చి ఆసనాలను అభ్యాసం చేయవచ్చు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.