
హత్యా..?ఆత్మహత్యా?
● కోనాడలో అనుమానాస్పదంగా
యువకుడి మృతి
● కుమారుడి మృతిపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు
● శవాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు
పూసపాటిరేగ: మండలంలోని కోనాడ గ్రామంలో యువకుడి మృతిపై పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, గ్రామస్తులు ధ్రువీకరిస్తుండగా తమ కుమారుడిని హత్య చేశారంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో యువకుడిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేలనుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. కోనాడ గ్రామానికి చెందిన బొడ్డు భూలోక (35), గ్రామానికి చెందిన బడి సూరిబాబుల మధ్య చిన్నపాటి విషయమై వాగ్వాదం జరిగింది. భూలోక తన కుమార్తె హాసినిని దుర్భాష లాడడంతో వరుసకు మేనమామ అయిన సూరిబాబు పిల్లలను ఎందుకు దుర్భాషలాడుతున్నావంటూ భూలోకను మందలించడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. జరిగిన విషయాన్ని సూరిబాబు సమీపంలోని బంధువులకు చెబుతుండగా, మద్యం మత్తులో ఉన్న భూలోక వెనక నుంచి మంచం కోడుతో సూరిబాబు తలపై బలంగా మోదడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే హుటాహుటిన చికిత్స నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సూరిబాబు బంధువులు బొడ్డు అశోక్, బొడ్డు చినభూలోక, బొడ్డు అప్పలస్వామిలు కోపోద్రిక్తులై రాత్రి 10 గంటల సమయంలో భూలోక ఇంటికి వెళ్లి చేయిచేసుకున్నారు. అకారణంగా సూరిబాబును ఎందుకు కొట్టావంటూ కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన భూలోక నిమిషాల వ్యవధిలో రెండుసార్లు ఉరివేసుకోవడానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు వారించి అడ్డుకున్నారు. అ తరువాత అర్ధరాత్రి 2 గంటల సయంలో భూలోక, తండ్రి అప్పన్నతో కలిసి మద్యం తాగాడు. సీతంపేటలో రంపం పనికోసం ఆదివారం తెల్లవారు జామున నూకరాజు అనే కాంట్రాక్టర్ ఇంటికి వచ్చి భూలోకను పిలుస్తుండగా తలుపులు తీయకపోవడంతో గదిలో చూడగా ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో భూలోక మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం శ్మశానంలో పూడ్చిపెట్టారు. అంత్యక్రియల అనంతరం ఇంటికి వెళ్లిన మృతుడి తండ్రి అప్పన్న తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, హత్య చేశారని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్‌లు కోనాడ శ్మశానానికి వెళ్లి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని గ్రామస్తుల సహకారంతో బయటకు తీయించి వైద్యులతో మ్మశానంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో బొడ్డు భూలోకది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తేలనుంది.
అనాథలైన పిల్లలు
మృతుడు భూలోక భార్య భూలోకమ్మ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా భూలోక మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. వారికి హాసిని, రజిని అనేకుమార్తెలు, అక్షియవర్ధన్ అనే కుమారుడు ఉన్నారు. అనుకోని ప్రమాదంలో తల్లి భూలోకమ్మ, తండ్రి భూలోకలు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. సంఘటనా స్థలానికి వచ్చిన వారంతా దేవుడా ముగ్గురు పిల్లలకు దిక్కెవరంటూ కన్నీరు పెట్టుకున్నారు. బొడ్డు భూలోక మృతిపై ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హత్యా..?ఆత్మహత్యా?

హత్యా..?ఆత్మహత్యా?

హత్యా..?ఆత్మహత్యా?