
ప్రణాళిక ప్రకారం వచ్చి.. వివాదం చేసి!
ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ సమావేశం ప్రారంభమైంది. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక, అక్కడ సిబ్బంది సైతం నిర్ఘాంతపోయారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన కౌన్సిలర్ మంత్రి రవి మైకు తీసుకున్నారు. రౌడీ షీటర్లు ఇక్కడ ఉండొచ్చా.. వారికి ఇక్కడ కూర్చొనే అర్హత ఉందా? అంటూ వివాదం రాజేశారు. దీనికి స్పందించిన 25వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఎన్.సుధీర్.. దళితుడినైన తనపై అన్యాయంగా కూటమి ప్రభుత్వం వారే కేసు పెట్టించారని తెలిపారు. ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో వాచ్‌మన్‌గా పని చేసిన వ్యక్తి కౌన్సిల్ సభ్యుడిగా ఉండవచ్చా? దీనికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని మంత్రి రవిని ఉద్దేశిస్తూ, అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంగా ఊగిపోయిన కౌన్సిలర్ రవి.. వివాదానికి దిగా రు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదన పెరిగింది. తోపులాటకు దారి తీసింది. పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అక్కడే ఉన్నప్పటికీ వారించే ప్రయత్నం చేయలేదు. కమిషనర్ వెంకటేశ్వర్లు అక్కడే ఉన్న పోలీసులకు సైగ చేశారు. దీంతో పోలీసులు కేవలం వైఎస్సార్‌సీపీకి చెందిన 25, ఒకటో వార్డు కౌన్సిలర్లు సుధీర్, ఆర్.బంగారునాయుడులను తోసుకుంటూ, నెట్టు కొంటూ బయటకు తరిమేశారు. ఎమ్మెల్యే, పోలీసుల వైఖరిని వైఎస్సార్‌సీపీ సభ్యులు తప్పుపట్టారు. ఏదో వివాదం చేద్దామనే ఉద్దేశంతోనే కూటమి సభ్యులు ఇక్కడికి వచ్చినట్లు అర్థమవుతోందని.. బడ్జెట్‌కు తాను ఆమోదం తెలుపుతున్నామని చెబుతూ చైర్‌పర్సన్ గౌరీశ్వరి సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. ఆమె వెంటే వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే, కమిషనర్, పోలీసుల వైఖరిని నిరసిస్తూ కార్యాలయం గేటు వద్ద ధర్నా చేపట్టారు.

ప్రణాళిక ప్రకారం వచ్చి.. వివాదం చేసి!