
పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు శంబర కృష్ణ, సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్‌లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్‌విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ పరిధిలోని వన్ స్టాఫ్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీకి కలెక్టరేట్‌లో శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మల్టీ పర్పస్ స్టాఫ్ కమ్ కుక్ ఫోస్టు –1, పారా లీగల్ పర్సనల్ పోస్టు – 1కి ఇంటర్వ్యూలు నిర్వహించారు. పారా లీగల్ పోస్టుకు ముగ్గురు, మల్టీపర్పస్ స్టాఫ్‌కు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అయిన సివిల్ సప్లయిస్ డీఎం బి.శాంతి, డీపీవో టి.వెంకటేశ్వరావు, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సూర్యనారాయణ, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నరసింహమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
కొత్తవలస సమీపంలో ఏనుగులు
కొమరాడ: మండల కేంద్రం సమీపంలోని కొత్తవలస గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచారిస్తూ కనిపించాయి. దీంతో చినఖేర్జిల, నయా బంజుకుప్పు, బూర్జివలస తదితర గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖాధికారులు సూచించారు. కొమరాడ నుంచి ఖేర్జిల వైపు వెళ్లే ప్రయాణికులు ఏనుగుల సమాచారాన్ని తెలుసుకుని వెళ్లాలని కోరారు. ఏనుగుల సంచార గ్రామాల్లో ప్రజల బయటకు రావొద్దని సూచించారు.
వడదెబ్బకు వ్యక్తి మృతి
సంతకవిటి : మండలంలో మందరాడ గ్రామానికి చెందిన బురావెల్లి అప్పారావు(58) ఉపాధి వేతనదారుడు పనులు వద్ద వడదెబ్బకు గురై మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న మందరాడలోని పెద్దచెరువులో ఉపాధి పనులు నిమిత్తం వెళ్లిన ఆయన మధ్యాహ్నం 5 గంటల సమయంలో అస్వస్తతకు గురయ్యాడు. ఒంట్లో అలసటగా ఉండడంతో తన భార్య ఆదమ్మకు చెప్పి అక్కడే కూర్చుండిపోయాడు. వెంటనే ఆమె తన భర్తకు ప్రాథమిక చికిత్స నిమిత్తం అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి ఆర్‌ఎంపీ వైద్యున్ని తీసుకొచ్చింది. ఇంతలోనే అప్పారావు మృతి చెందాడు. ఆరోగ్యంగా తిరిగాడే తన భర్త మృతి చెందడంతో ఆదమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. పొట్ట కూటి కోసం ఉపాధి పనులకు వెళ్తే వడదెబ్బకు తన భర్త గురయ్యాడని రోదిస్తుంది. అప్పారావు ఉపాధి పనులకు వచ్చి అస్వస్తతకు గురయ్యాడని, ఆ కుటుంబానికి ఉపాధి పథకం ద్వారా సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన

పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన