
కళల పరిరక్షణ అందరి బాధ్యత
● మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ అనురాధ
● ముగిసిన వాగ్దేవీ బాల సంస్కార శిక్షణ తరగతులు
విజయనగరం టౌన్: కళలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ బురిడి అనురాధ పరశురామ్ పేర్కొన్నారు. స్థానిక గురజాడ స్వగృహంలో వాగ్దేవీ సమారాధనం సంస్థ, తెలుగు భాషా పరిరక్షణ సమితితో కలిసి పది రోజుల పాటూ నిర్వహించిన వాగ్దేవీ బాల సంస్కార శిక్షణా శిబిరాల ముగింపు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాన్ని పరిచయం చేసేందుకు, వాటిని పరిరక్షించాలనే లక్ష్యంతో వాగ్దేవీ సమారాధనం సంస్థ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంతో పాటూ భగవద్గీత సారాంశాన్ని పది రోజుల పాటూ వివరించామన్నారు. శతక పద్యాలపై అవగాహన పెంపొందించగలిగామన్నారు. ఈ సందర్భంగా పది రోజుల పాటూ ఉచిత రీతిన విద్యార్థులను సుశిక్షితులను చేసిన గురువులను సత్కరించి, ప్రశంసపత్రం, జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులకు బహుమతులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ జి.ఎరుకునాయుడు, డాక్టర్ జక్కు రామకృష్ణ, అమ్మాజమ్మ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ గోటేటి హిమబిందు, గురజాడ ఇందిర, మానాప్రగడ సాహితీ, కొంకెపూడి అనూరాధ, చెళ్లపిళ్ల శ్యామల, గిరిజా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.