
కోవిడ్‌పై తస్మాత్..
విజయనగరం ఫోర్ట్: యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. కోవిడ్ పేరు చెబితే ఇప్పటికీ జనం హడలిపోతున్నారు. మొదటి, రెండు కోవిడ్‌ల్లో కోవిడ్ బారిన ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది సకాలంలో చికిత్స చేయించుకుని ప్రాణాలతో భయపడ్డారు. రెండేళ్లు పాటు ప్రజలు కోవిడ్ కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవించారు. గత కొన్నేళ్లుగా వ్యాప్తి లేకపోవడంతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ప్రపంచలోని పలు దేశాలతో పాటు మన దేశంలో కూడా కోవిడ్ కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. పొరుగున ఉన్న విశాఖలో కూడా కోవిడ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి సూచించారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్క కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సామూహిక ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు వాడాలన్నారు. భౌతిక దూరం పాటించాలని, హ్యాండ్ వాష్ తదితర వాటితో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆందోళన అవసరం లేదు..
డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి