
ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఎండీయూ వాహనాలతో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో 27 వేల మంది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. రేషన్‌కు బదులు నగదు బదిలీ అమలు కోసం కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థపై దాడి చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చు వేతనాలతో వాహన సర్వీసు, పెట్రోల్, రేషన్ తరలింపు ఖర్చు భరించి ప్రజలకు ఇంటింటికి సకాలంలో పంపిణీ చేస్తున్న వ్యవస్థను రద్దు చేయటం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు సిహెచ్.వెంకటరావు, పవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.