
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ (32) అప్పులు బాధ భరించలేక పురుగులు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ తన అవసరాల నిమిత్తం అప్పులు ఎక్కువగా తీసుకున్నాడు. అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి రావడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అందుతుండగా గురువారం ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య మంగ, కుమారుడు రుషివర్ధన్, కుమార్తె లహరి ఉన్నారు. గుర్ల ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధి వేతనదారు మృతి
బాడంగి: మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు చెలపురెడ్డి తవుడమ్మ(68) పని చేస్తున్న ప్రదేశంలో గురువారం మృతి చెందినట్టు ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు మరియదాస్ తెలిపారు. గ్రామంలో జగ్గన్న చెరువు పూడిక పనులు చేస్తుండగా చద్దన్నం తిని చేతులు కడుగుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఏపీవో సాయిరాం, టీఏ శ్రీనివాసరావు ఎంపీడీవో ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీడీవో వేతనదారు మృతి పట్ల సంతాపం తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
నెల్లిమర్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మండలంలోని సారిపల్లి గ్రామానికి చెందిన యువకుడు నడిపేన పురుషోత్తం(27) గురువారం మృతి చెందాడు. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బద్రీనాధ్ యాత్ర నిమిత్తం యాత్రికులను తీసుకువెళ్లేందుకు బస్సు డ్రైవర్లుగా సారిపల్లికి చెందిన పురుషోత్తం, శ్రీనివాసరావు ఈ నెల 15న వెళ్లారు. 17వ తేదీ అర్ధరాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గడ ప్రాంతంలో బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో క్యాబిన్‌లో కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు చికిత్స నిమిత్తం ప్రైవేటు అంబులెన్సులో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు వైద్యులు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తం ప్రాణాలు విడిచాడు. మృతుడికి తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నారు. పురుషోత్తం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య