వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి... | - | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి...

May 23 2025 2:29 AM | Updated on May 23 2025 2:29 AM

వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి...

వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి...

తెర్లాం: వివాహ వేడుకలకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న తల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట తెర్లాం మండలంలోని రాజయ్యపేట గ్రామానికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువకుడు బుధవారం రాత్రి జరిగిన ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు, కుటుంబ సభ్యులు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన గెడ్డ రామకృష్ణ(24) తెర్లాంలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల వద్ద బుధవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మరణించాడు. తెర్లాం మండలం రాజయ్యపేట గ్రామంలో జరగనున్న వివాహ వేడుకలో పాల్గొనేందుకు తన మేనమామ ఇంటికి నాలుగు రోజుల క్రితం రామకృష్ణ వచ్చాడు. అక్కడ జరిగిన వివాహ వేడుకలో పాల్గొని అందరితో సరదాగా గడిపాడు. బుధవారం రాత్రి తెర్లాం మండలం ఎం.ఆర్‌ అగ్రహారంలో జరుగుతున్న స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రామకృష్ణ తన చినమేనమామతో కలిసి ఆటోలో వెళ్లాడు. వివాహ వేడుకలో పాల్గొని అక్కడ భోజనం చేసి తిరిగి రాజయ్యపేట గ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ఆటోను తన చినమేనమామ నడుపుతుండగా అతని పక్కన రామకృష్ణ కూర్చొన్నాడు. తెర్లాం వెంకటేశ్వర కళాశాల వద్దకు వచ్చే సరికి ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. దీంతో రామకృష్ణ కింద పడిపోగా, ఆటో అతనిపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు రామకృష్ణను బయటకు తీశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేసేటప్పటికే రామకృష్ణ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని ఎస్‌ఐ చెప్పారు. మృతుని సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించినట్టు ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు.

బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తూ..

రామకృష్ణ బైక్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రామకృష్ణ తండ్రి వెంకటరమణ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి రామకృష్ణ బైక్‌ మెకానిక్‌గా పని చేస్తూ తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తల్లి, తమ్ముడిని పోషిస్తున్నాడు. వివాహ వేడుకకు మేనమామ ఊరు వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న రామకృష్ణ తల్లి, తమ్ముడు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement