
శ్యామలాంబ హుండీ ఆదాయం రూ.8.19 లక్షలు
సాలూరు: సాలూరు శ్యామలాంబ అమ్మవారి హుండీ ఆదాయం 8,19,900 రుపాయిలు వచ్చినట్లు ఎండోమెంట్ అధికారి రమేష్ గురువారం తెలిపారు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. హుండీ ఆదాయాన్ని ఆలయంలోనే లెక్కింపు చేపట్టారు.
ప్రీ ఎక్లాంప్సియాపై అవగాహన
పార్వతీపురం టౌన్: గర్భిణుల్లో ప్రీ ఎక్లాంప్సియా ఒక ప్రమాదకర సూచికని, సకాలంలో లక్షాణాలు గుర్తించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.భాస్కరరావు సూచించారు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు హైరిస్క్ సమస్యలు ముందస్తుగా గుర్తించాలన్నారు. బీపీ అధికంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్య, ముఖం,చేతులు, కాళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన తగ్గడం తదితర లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, పీఎల్ రఘుకుమార్, డీపీహెచ్‌ఎన్‌వో ఉషారాణి, డీపీవో లీలారాణి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, డీసీఎం విజయలత, సీసీ శ్రీనివాసరావు, వైద్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అమ్మవారి హుండీల్లో చోరీ
సాలూరు: పట్టణంలోని పలు ఆలయాల్లో హుండీల్లో చోరీలు జరిగాయి. పట్టణంలోని నూకాలమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, దేశమ్మ తల్లి ఆలయాల్లో హుండీలను దుండగలు పగులగొట్టి నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఉపాధ్యాయ బదిలీల వెబ్‌సైట్ వేగాన్ని పెంచాలి
● ఏపీ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్
పార్వతీపురం టౌన్: రాష్ట్రంలో మొట్టమొదటిసారి బదిలీల చట్టాన్ని అనుసరించి జరుగుతున్న బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన స్థానికంగా మాట్లాడారు. బదిలీలకు దరఖాస్తు చేయడంలో సర్వరు యొక్క వేగాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఏఏ పాఠశాలల్లో ఏఏ పోస్టులు అదనంగా ఉన్నాయో ఈ జాబితాల ద్వారా తెలుస్తుందని తద్వారా సంబంధిత ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు. కావున ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయుల రీఅపోర్షన్‌మెంట్ వివరాలు వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నామన్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులను అనుసరించి బెంచి మార్క్ వ్యాధులు గల ఉపాధ్యాయులకు ఈ బదిలీ నియమాలు వర్తించవనీ, అయితే సంబంధిత వ్యక్తులు వారికి అంగీకారం అయితే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

శ్యామలాంబ హుండీ ఆదాయం రూ.8.19 లక్షలు