
భూ సమస్యలు తలెత్తకూడదు..: జేసీ
గజపతినగరం : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతన్నలకు భూ సమస్యలు వస్తే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కారం చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. గజపతినగరం మండల కేంద్రం పురిటిపెంట పాల్తేరు వారి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఐదు మండలాల రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులు సమస్యలతో కార్యాలయాలకు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి వారి సమస్యలను సంపూర్ణంగా అడిగి తెలుసుకొని పరిష్కరించేలా ఉండాలని సిబ్బందికి సూచించారు. భూ సమస్యల పరిష్కారం విషయంలో రీసర్వే అయిన తరువాత వచ్చిన ఎల్‌పీఎం నంబర్లు, సర్వే నంబర్లు టాలీ చేసుకొని తప్పులు దొర్లకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. బొబ్బిలి ఆర్‌డీవో జెవిఎస్‌ఎస్.రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలాగాంధీ, ఈడీ ఎస్సీ సొసైటి ఇంచార్జ్ ఆర్‌డీవో వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్ధార్ బి.రత్నకుమార్‌తో పాటు ఐదు మండలాల తహసీల్లార్లు, సర్వేయర్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.