
24న గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
పార్వతీపురం: ఐటీడీఏ ఆధ్వర్యంలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 24న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పీఓ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూలకు చెందిన విద్యార్థులు పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఉదయం 10గంటల నుంచి జరగనున్న కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. విద్యార్థులు పదోతరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు.
సీతంపేటలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
పార్వతీపురం టౌన్: పజాసమస్యల పరిష్కార వేదికను సోమావారం 10 గంటల నుంచి సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను సీతంపేట వచ్చి అందజేయాలని కోరారు. జిల్లా అధికారులందరూ సీతంపేటలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
ఆధునిక సాగుకు మార్గనిర్దేశం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఆధునిక విజ్ఞానం, సంప్రదాయ పద్ధతులు కలగలిపిన వ్యవసాయం అందరి లక్ష్యం కావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్ దేశవ్యాప్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఐసీఏఆర్ డైరెక్టర్లకు సూచించారని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఽధ్రువ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సదస్సును ప్రారంభించారని గురువారం విలేకరులకు తెలిపారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే ఆధునిక విజ్ఞానం, సంప్రదాయ పద్ధతులు కలగలిపిన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ‘వికసిత భారత్’ లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారని, ఉత్పత్తి పెంపు, ఖర్చుల తగ్గింపు, సరైన ధర, సహజ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విషయాలపై కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని వివరించారన్నారు. రైతుల సమస్యలపై నేరుగా చర్చించేందుకు ఆయన పాదయాత్ర చేపడతారని తెలిపారన్నారు. వ్యవసాయ విద్యను ప్రాయోజితంగా మార్చాలని, పరిశోధనలు రైతుల వరకూ చేరాలని సూచించినట్లు పేర్కొన్నారన్నారు.
వ్యాసరచన పోటీల్లో
బొబ్బిలి విద్యార్థినికి ఫస్ట్
బొబ్బిలిరూరల్: మండలంలోని పెంట గ్రామ ఉన్నత పాఠశాలకు చెందిన తమ్మిరెడ్డి యశస్విని జీవవైవిధ్యంపై జోనల్ విభాగంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంలో భాగంగా యశస్వినికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసినట్టు పాఠశాల హెచ్‌ఎం చింతా రమణ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.