యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతిఒక్కరూ యోగాను జీవనంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆయుష్, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో యోగాభ్యసన మాసోత్సవాన్ని బుధవారం ప్రారంభించారు. ఆర్‌సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన యోగాంధ్ర ప్రచార ర్యాలీకి పచ్చజెండా ఊపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా నెలరోజుల ముందు నుంచే గ్రామ, మండల స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు యోగాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు యోగాభ్యసన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆసనాలు వేయడం సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా ఆయుష్ వైద్యాధికారి బి.సుశీల, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రొగ్రాం అధికారులు ఎం.వినోద్‌కుమార్, టి.జగన్మోహనరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, యోగా శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం


