వేడెక్కిన స్థానిక రాజకీయం | - | Sakshi
Sakshi News home page

వేడెక్కిన స్థానిక రాజకీయం

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

వేడెక్కిన స్థానిక రాజకీయం

పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాలపై కసరత్తు రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నేడు ఎన్నికల ప్రక్రియపై ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ రేపు జిల్లాలోని అధికారులతో కలెక్టర్‌ సమావేశం

రాజకీయ పార్టీల్లోనూ కదలిక...

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఇంతకాలం నెమ్మదిగా సాగిన వ్యవహారం ఇప్పుడు ఊపందుకుంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్‌, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వచ్చినా ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది.

సత్తెనపల్లి: ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్‌ బాక్సుల లభ్యత, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు సాధారణంగా ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి సుమారు 650 మంది ఓటర్లను కేటాయించేలా కసరత్తు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వివరాలు, భవనాల ఫొటోలు, ఓటర్ల సంఖ్య, అక్షాంశ–రేఖాంశాలను ఎస్‌ఈసీ–ఈఎంఎస్‌లో నమోదు చేసే ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివిధ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి మండలాలకు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ఎన్నికల ప్రిసైడింగ్‌, నామినేషన్‌, విత్‌డ్రా పత్రాలు వంటివి ఉన్నాయి. జిల్లాలో 525 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు 28 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లు, 425 ఎంపీటీసీలు, 6 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీల ఎన్నికల కోసం అధికారులను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విధుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తున్నారు. బ్యాలెట్‌ బాక్సులు కూడా సిద్ధం చేస్తున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌ ప్రక్రియ కూడా సిద్ధమవుతోంది.

ఎస్‌ఈసీ అడుగులపై ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల ఒకటిన హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు పరిస్థితి మరింత స్పష్టమైంది. తీర్పుతో రాష్ట్ర స్థాయిలో ఎస్‌ఈసీ తదుపరి అడుగులపై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్‌, రిజర్వేషన్లు, వార్డులవారీ ఏర్పాట్లు తదితర అంశాలు కొలిక్కి వచ్చిన వెంటనే జిల్లాలో ఎన్నికల యంత్రాంగం మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఈ నెల 7న ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనంతరం జిల్లాలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, డీడీవోలు, డీఎల్‌పీఓలతో ఈ నెల 8వ తేదీన ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించనున్నారు.

కొత్త జెడ్పీతో కీలక మార్పు

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పల్నాడు జిల్లాకు ప్రత్యేక జిల్లా పరిషత్‌ ఏర్పాటైంది. గత నెల 25వ తేదీ నుంచి కొత్త జిల్లా ప్రాతిపదికన జెడ్పీ ఏర్పాటైంది. జిల్లాలోని 28 మండలాలతో కొత్త జిల్లా పరిషత్‌ ఏర్పాటు కాగా, గతంలో ఉమ్మడి గుంటూరు జెడ్పీ పరిధిలో కొనసాగిన వ్యవస్థకు తెరపడింది. స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త జిల్లా ప్రాతిపదికన జరగనున్నాయి. జెడ్పీ చైర్మన్‌ పదవి ఇక్కడే ఉండనుంది. పల్నాడు రాజకీయాల్లో ఇది కీలకంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో రాజకీయ పార్టీల్లోనూ కదలిక కనిపిస్తోంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ స్థానాలపై స్థానికంగా ఎవరెవరు పోటీ చేయాలన్న దానిపై చర్చలు ఊపందుకుంటున్నాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యంగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత అసలు రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఎస్‌ఈసీ షెడ్యూల్‌ ఎప్పుడు ప్రకటిస్తుంది? రిజర్వేషన్లు ఎలా ఖరారవుతాయి? కొత్త జెడ్పీ పరిధిలో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయి? అనేదే ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. బుధవారం జరిగే ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement