బొల్లాపల్లి: కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి మృతదేహం స్థానిక చప్పిడి వాగు చెరువు స్థలంలో లభ్యమైన ఘటన బొల్లాపల్లి వద్ద మంగళవారం జరిగింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాకు చెందిన మూలింటి చిన్నస్వామి(50) భార్య మహేశ్వరమ్మతో కలిసి గత నెల 27న బొల్లాపల్లి గ్రామ సమీపంలోని శ్రీగంధం తోటలో కూలి పనులకు వచ్చాడు. ఈ నెల 2వ తేదీన వంటకు కట్టె పుల్లల కోసం వెళ్తున్నాను అని భార్యతో చెప్పి వెళ్లిన చిన్నస్వామి ఇంటికి తిరిగి రాలేదు. పలుచోట్ల విచారించిన భార్య, చుట్టుపక్కల వారు లాభం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఈక్రమంలో గుర్తుతెలియని మృతదేహం బొల్లాపల్లి వద్ద చప్పిడివాగు స్థలంలో లభ్యమయిందనే సమాచారంతో అక్కడికి వెళ్లి విచారించిన పోలీసులు, మృతుడు చిన్నస్వామిగా గుర్తించారు. మృతుడు చిన్నస్వామికి మద్యం అలవాటు ఉండటం, షుగర్ పేషెంట్ కావడంతో మద్యం సేవించి ఆ పరిసర ప్రాంతాల్లో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య ఇరువురు సంతానం ఉన్నారు. భార్య మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం.నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు.


