రాష్ట్రాన్ని అమ్మేందుకు చంద్రబాబు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని అమ్మేందుకు చంద్రబాబు సిద్ధం

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

ఎమ్మెల్యే జీవీ అభివృద్ధి చేసింది శూన్యం ఇచ్చిన హామీలు అమలు చేయలేక అసత్య ప్రచారాలు తాగునీటి ట్యాంకర్ల పేరుతో దండుకోవడం మామూలే వినుకొండలో సామాన్యుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: ఆంధ్ర రాష్ట్రాన్ని కొనేవాళ్లు ఎవరైనా ఉంటే అమ్మేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అలవి కాని హామీలు ఇచ్చి ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని, ఇచ్చిన 16 వేల డీఎస్సీ పోస్టులు అనర్హులకు ఇచ్చి వాస్తవాలు బయటకు తెలిసేటప్పటికీ చేసిన తప్పులు సరిదిద్దుకోలేక గతంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీపీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేయాలని చెప్పినా కూడా సిగ్గు లేకుండా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ధరలు పెరిగాయంటూ..

గతంలో ధరలు పెరిగాయని బాదుడే బాదుడు అని గోల చేసిన టీడీపీ నాయకులు, పెట్రోలు దగ్గర నుంచి నిత్యాసరాలు ధరలు పెరిగితే ఏమి చేస్తున్నారని బొల్లా ప్రశ్నించారు. ఇక స్థానిక ఎమ్మెల్యే వినుకొండకు తాగునీరు అందించే సింగర చెరువు ఉంటే చెరువుల్లో చేపలు పెంచిన ఘనత మీ నాయకులదేనన్నారు. తాగునీటి సమస్యను అడ్డం పెట్టుకొని ట్యాంకర్‌ ద్వారా వందల కోట్లు డ్రా చేసిన విషయం వినుకొండ ప్రజలందరికీ తెలుసు ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లు టీడీపీ హయాంలో 20 శాతం పూర్తయితే మిగతా 60 శాతం మా ప్రభుత్వం హయాంలో పూర్తి చేశామని, మిగిలిన ఇళ్లను పూర్తిచేసే అర్హులైన పేదవాళ్లకి ఇప్పటికై నా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాదర్బార్‌ ఓ డ్రామా....

ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు తీసుకుంటూ ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. వినుకొండకు మీరు చేసిన అభివృద్ధి పక్కన పెడితే వారికి పురుషుల ప్రాజెక్టు నిర్మాణం, వినుకొండకు వంద పడకల ఆస్పత్రి, ముస్లిం మైనారిటీ కళాశాల, షాదీఖానా, కూరగాయల మార్కెట్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, వంటి అభివృద్ధి పనులు తమ హయాంలో అనుమతులు తీసుకురాగా రెండున్నరేళ్లయిన వాటిని పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పట్టణంలో యథేచ్ఛగా ఆక్రమణలు..

పట్టణంలో ఆర్యవైశ్యుల ఆస్తులు, క్రిస్టియన్‌ మైనార్టీ ఆస్తులు సామాన్యుల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ నయీమ్‌ గ్యాంగ్‌ పేరుతో ఆక్రమిస్తున్నారని, మీరు పంచాయతీ చేసిన సన్నిధి వారి స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తుంటే టీడీపీ నాయకులు రాత్రికి రాత్రి పడవేశారని ఆరోపించారు. రెవెన్యూ, పోలీస్‌ ఇతర అధికారుల తీరు అత్యంత దారుణంగా ఉందని, టిడిపి నాయకులతో కలిసి లంచాలు తీసుకోవడం అలవాటు పడ్డారని పేర్కొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మక్కెన తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుది పార్టీలు మారే సంస్కృతి అని విమర్శించారు.

రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అయిందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి పగడాల వెంకట్రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్‌ ప్రసాద్‌, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement