వినుకొండ: బాల్‌బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలలో మెడిశెట్టి సాయి కౌశిక్ ప్రతిభ చాటాడు. మార్కాపురంలో ఇటీవల 11వ ఏపీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. వినుకొండలోని శ్రీవిజేత హైస్కూల్ విద్యార్థి మెడిశెట్టి సాయి కౌశిక్, ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున అండర్–16 విభాగంలో ప్రాతినిధ్యం వహించి 3వ ర్యాంక్ సాధించాడు. రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు మంచి పేరు తెచ్చిన విద్యార్థిని స్కూల్ కరస్పాండెంట్ కావూరి సాయికుమార్, డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మయ్య అభినందించారు.
ఆర్టీసీ బస్సులో పొగలు
నరసరావుపేట రూరల్: ఆర్టీసీ బస్సులో పొగలు రావటంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన మండలంలోని జొన్నలగడ్డ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సులో ఒక్కసారిగా పొగలు రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా దించారు. బస్సు బీ6 టెక్నాలజీ కావటంతో రేడియేటర్ వేడెక్కిన కారణంగా పొగలు వచ్చినట్టు గుర్తించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.
గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం
దుర్గి: నాగార్జున సాగర్ కుడికాలువలో అడిగొప్పల చానల్ వద్ద మంగళవారం గల్లంతైనా మాదారపు అజయ్(19) మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానిక ఎస్‌ఐ బి.గోపాల్ నేతృత్వంలో గజ ఈతగాళ్లు సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా నరమాలపాడు లాకుల వద్ద మృతదేహం దొరికింది. మంగళవారం వినాయక నిమజ్జనం చేసేందుకు పలువురితో కలసి వెళ్లి కుడి కాలువ నీళ్లలో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడు. చేతికొచ్చిన కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మంగళగిరిలో మహిళా క్రికెట్ సందడి
ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్
మంగళగిరి టౌన్: మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు వేదిక కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఏపీఎల్) 2026 సీజన్–1కు మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్‌స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడంతో నగరానికి మరోసారి క్రీడావేదికగా గుర్తింపు లభించనుంది.
అమరావతిలో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలి
మంగళగిరి టౌన్: రాజధాని అమరావతిలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 25 అడుగుల భారీ విగ్రహంతో పాటు ఘంటసాల కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర చైతన్య వేదిక, ఘంటసాల చైతన్యవేదిక అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్ర చైతన్య వేదిక 17వ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ, వేదిక గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి ఆంజనేయ రాజు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
‘సాఫ్ హ్యాక్‌ఫెస్ట్’ వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19వ తేదీన చైన్నెకి చెందిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ, కళాశాల సంయుక్తంగా జాతీయ స్థాయి సాప్ హ్యాక్‌ఫెస్ట్ 2026 నిర్వహించనున్నట్లు చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవీ ఆంజనేయులు తెలిపారు. బుధవారం కళాశాలలో పెస్ట్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సాంకేతిక పరమైన పోటీ ప్రపంచంలో విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హ్యాకఫెస్ట్ ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


