కన్న కూతురే హంతకురాలు
పొన్నూరు: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని కూలి పనులతో జీవనం భారమై.. భర్తతో సహా తల్లి పంచన చేరి, డబ్బు, నగల కోసం ఆమెనే హత్య చేసిన కసాయి కూతురి ఉదంతమిది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్థనరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని క్యాబిన్ పేటలో ఈ నెల 12వ తేదీన తల్లిని హతమార్చిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. క్యాబిన్ పేటలో నివాసం ఉంటున్న మృతురాలు ఈవూరు లక్ష్మీకి కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన మనవడు జాషువాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కుమారుడు మరణించినప్పుడు వచ్చిన ఇన్య్సూరెన్స్ డబ్బులతో లక్ష్మీ బంగారం నగలు చేయించుకున్నారు. ఆమె కూతురు పుష్పలత మొదటి భర్తతో విడిపోయి, రెండో భర్త చనిపోవడంతో, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయమైన సఖినేటిపల్లికి చెందిన రాకేష్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకొని తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ జీవన సాగిస్తోంది. కూలి పనులతో జీవనం భారంగా మారడంతో ఆర్థిక సహాయం కోసం పొన్నూరులో ఉంటున్న తల్లి లక్ష్మిని వారు ఆశ్రయించారు. అయితే రెండు నెలల పాటు కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయకుండా ఉండడంతో తల్లి వారిద్దరిని తిరుపతికి వెళ్లిపోవాలంటూ మందలించింది. అయితే ఎలాగైనా తల్లి మెడలోని బంగారం, బీరువాలోని డబ్బులు కాజేయాలని కూతురు, అల్లుడు పన్నాగం వేశారు. 12వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మి నిద్రలో ఉండగా గొంతుకు చున్నీ బిగించి హత్యకు పాల్పడ్డారు. ఆమె మెడలోని బంగారం తాడుతోపాటు బీరువాలోని డబ్బులు అపహరించి పరారయ్యారు. హత్య చేయడాన్ని చూసిన మనవడు జాషువా వివరాలను పోలీసులకు తెలిపాడు. మృతురాలి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో నిందితులైన పుష్పలత, రాకేష్‌కుమార్‌ను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.
కుంభకర్ణ రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత
మంగళగిరి రూరల్: పాడైన ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న మాంసం అపరిశుభ్రంగా ఉన్న వంటగది మొదలగు లోపాలు రెస్టారెంట్‌లో బయటపడటంతో మండల పరిధి కాజా గ్రామం టోల్‌ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యూజియన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఐపీఎం డైరెక్టర్ అరుణ్‌బాబు స్వయంగా తనిఖీ చేసి పాడైన మాంసం, అపరిశుభ్ర వంటగది తదితర లోపాలను గుర్తించారు. దీంతో రెస్టారెంట్ వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత అధికారులు బి.నరసింహుడు, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


