విద్యార్థినిని బెదిరించిన యువకుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని బెదిరించిన యువకుడు అరెస్ట్‌

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

తెనాలిరూరల్‌: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమై బీటెక్‌ విద్యార్థినిని నమ్మించి మోసం చేయడమే కాకుండా నగలను అపహరించి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ డి.రవీంద్రబాబు వివరాలను వెల్లడించారు. స్థానిక గంగానమ్మపేటకు చెందిన బీటెక్‌ విద్యార్థినికి ఇన్‌స్ట్రాగామ్‌లో కఠెవరం గ్రామానికి చెందిన కమాధుల సాయి అలియాస్‌ పవన్‌ సాయి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు చెబుతూ నమ్మించి ఆమె నుంచి బంగారపు వస్తువులు, రూ. 40,700 నగదు, వెండి పట్టీలు తీసుకున్నాడు. వాటిపై ఉమా కీర్తన పలుమార్లు ప్రశ్నించడంతో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని, ఆమె వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1.30 లక్షల విలువైన బంగారపు గొలుసు, రెండు ఉంగరాలు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ సిహెచ్‌. రాజ్యలక్ష్మి నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించారని, ఆమెను డీఎస్పీ అభినందించారని తెలిపారు.

చుట్టంలా వచ్చి చోరీలు..

చుట్టంలా వచ్చి కొద్ది రోజులు ఇంట్లో ఉండి విడతల వారీగా వస్తువులు దొంగిలించి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఐ డి. రవీంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక ఐతానగర్‌కు చెందిన నిమ్మగడ్డ జితేంద్ర శ్రీనివాస ప్రసాద్‌ ఇంటికి తాడికొండ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన బంధువు జాగర్లమూడి భరత్‌ వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటన్న భరత్‌ తనకు ఇంటర్వ్యూ ఉందంటూ చెప్పి నమ్మించాడు. దాదాపు నెల రోజులపాటు ఉన్న భరత్‌, ఇంటిలో ఒక్కొక్కటిగా వస్తువులు దొంగిలించాడు. వెళుతూ శ్రీనివాస ప్రసాద్‌కు చెందిన వాహనాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.7.50 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల బంగారు పూసల గొలుసు, 18 గ్రాముల బంగారు గొలుసు(తాకట్టు), నిందితుడు అపహరించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement