దళిత యువకుల మృతిపై న్యాయవిచారణ చేయండి | - | Sakshi
Sakshi News home page

దళిత యువకుల మృతిపై న్యాయవిచారణ చేయండి

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

లక్ష్మీపురం: రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో దళితులపై దాడులు గణనీయంగా పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. దొంగతనం నెపంతో మంగళగిరిలో హత్య గురైన మేకల రమేష్‌ కుటుంబ సభ్యులను తుళ్లూరు మండలం దొండపాడులో వి.శ్రీనివాసరావుతో పాటు కేవీపీఎస్‌ నాయకులు బుధవారం పరామర్శించారు. అలాగే పోలీసు దెబ్బలకు తాళలేక మృతిచెందిన దళిత యువకుడు చీకటి గోపి కుటుంబ సభ్యులను కూడా తాడికొండ మండలం పొన్నెకల్లులో పరామర్శించారు. అనంతరం గుంటూరులోని బ్రాడీపేట పార్టీ కార్యాలయంలో విలేకరులు సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో దళితులు పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. దళితుల కేటాయించిన తాడికొండ నియోజకవర్గంలో ఈ ఘటనలపై ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించలేదన్నారు. దొంగతనం నెపంతో మేకల రమేష్‌ పెత్తందారులు కొట్టగా చనిపోగా, చీకటి గోపి పోలీసులు కొట్టడంతో చనిపోయాడని తెలిపారు. ఈ రెండు ఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా ఉందన్నారు. తాడికొండ సీఐపై ఆరోపణలు వస్తే మేడికొండూరు సీఐని విచారణ అధికారిగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే స్థాయి అధికారిని విచారణ అధికారిగా ఇలా నియమిస్తారా అని ప్రశ్నించారు. విచారణ పూర్తికాకుండానే పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే జ్వరంతో చీకటి గోపి మృతి చెందాడని డీఎస్పీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధితులను ఇంతవరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పరామర్శించలేదన్నారు. కొద్దిరోజుల క్రితం తాడేపల్లిలో ఎస్టి యువకుడు కూడా దొంగతనం కేసులో మృతి చెందాడని ఆరోపించారు. ఈ ఘటనలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లో అభివద్ధి కన్నా పేదలపై దాడులు పెరిగాయన్నారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద గురువారం దళిత సంఘాలు చేయనున్న ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు బి.లక్ష్మణరావు, జె.నవీన్‌ప్రకాష్‌ పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement