ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వర్సిటీ వీసీ కె గంగాధరరావు అన్నారు. స్వర్ణోత్సవాలు విజయవంతం కావడంతో మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచేలా స్వర్ణోత్సవాలు నిర్వహించామన్నారు. వేడుకల నిర్వహణలో బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. దశల వారీగా నిర్వహించిన కార్యక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ, విదేశాలలో ఏఎన్‌యూ కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం మాట్లాడుతూ స్వర్ణోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వర్సిటీ పాలకమండలి సభ్యులు ఎం.త్రిమూర్తిరావు, ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డాక్టర్ పి.సుధాకర్, వర్సిటీలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్ సిహెచ్.లింగరాజు, ప్రొఫెసర్ పీపీఎస్ పాల్ కుమార్, ప్రొఫెసర్ తేజోమూర్తి, ప్రొఫెసర్ నిరూపమా, దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డి.రామచంద్రన్ పాల్గొన్నారు.


