యడ్లపాడు: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో యడ్లపాడు మండలం అతలాకుతలమైంది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. సోమవారం పగలంతా నిప్పుల వర్షం కురిపించిన భానుడు, సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభిస్తుందని ఆశించిన జనంపై ప్రకృతి పగబట్టినట్లయింది. ఈదురు గాలుల తీవ్రతకు యడ్లపాడు సవళ్ల ప్రాంతంలో నాలుగు ఇళ్లపై ఉన్న సిమెంటు రేకులు ఒక్కసారిగా పెకలించుకుపోయి గాల్లోకి లేచాయి. ఆ రేకులు సుదూరంగా ఉన్న స్థానికులపై వచ్చి పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రాంతానికి చెందిన పల్లపు పింకీ అనే బాలికకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మైదవోలు – లింగారావుపాలెం మధ్య ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభం కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలం వ్యాప్తంగా సుమారు 20 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి లైన్లు తెగిపోయాయని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.
దాచేపల్లి: దాచేపల్లిలో ఈదురు గాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఈదురుగాలుల తో కూడిన వర్షం కురవడంతో దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో సుమారుగా 42 స్తంభాలు గాలికి కూలిపోయాయి. కొన్నిచోట్ల స్తంభాలు నివాస గృహాలు, దుకాణాలపై విరిగి పడ్డాయి. కరెంటు తీగలు కూడా తెగి నేలపై పడ్డాయి. నగర పంచాయతీ పరిధిలో ఆరుకు పైగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దాచేపల్లి మండల పరిధిలో సుమారుగా 58 పైగా విద్యుత్ స్తంభాలు విరిగాయి. విద్యుత్ శాఖకు సుమారు రూ. కోటిన్నరకు పైగా నష్టం జరిగి ఉంటుందని ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
మాచవరం: మండలంలోని పిన్నెల్లి, చెన్నాయపాలెం వేమవరం, మాచవరం గ్రామాల్లో సోమవారం సాయంత్రం భీకర గాలులతో కూడిన వర్షం కురిసింది. పెనుగాలులకు అనేకచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లపైన వేసిన రేకులు నెగిరిపోవడంతో గృహాల్లోని వస్తువులు తడిచి ముద్దయ్యాయి. సజ్జ, జొన్న, మొక్కజొన్న కోసిన కంకులు నేలపై ఆరబోయడంతో అవి తడిసి ముద్దయ్యాయి. బొప్పాయి, అరటి తోటలు నేలకొరిగాయి.
ముప్పాళ్ళ: అకస్మాత్తుగా మబ్బులతో పాటుగా ఈదురుగాలులు కూడిన వర్షం పడటం తో మండల వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సోమవారం సాయంత్రానికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని భారీ గాలులతో కూడిన వర్షం కురవటంతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం లభించినట్లయింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటుగా వడగండ్ల కూడా పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
పిడుగురాళ్ల: పట్టణంలో సోమవారం సాయంత్రానికి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీయటంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈదురు గాలుల ప్రభావం వలన పట్టణంలో కరెంట్ కోత విధించారు.


