రూ.6.76 లక్షల విత్తన విక్రయాలు నిలిపివేత
నగరంపాలెం: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణంలో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వ్యవసాయ అధికారులతో కలిసి శనివారం విత్తనాల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ అధికారి డి.సూర్యశ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఆయా దుకాణాల్లో స్టాక్ వివరాలను నిశితంగా పరిశీలించారు. చిలకలూరిపేట పట్టణం బోస్‌రోడ్డులోని వాసవి ఎంటర్‌ప్రైజెస్, అనంతలక్ష్మి ట్రేడర్స్‌ల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. రికార్డులను నిర్వహించకపోవడం, విత్తనాలకు సంబంధించి మూల సంస్థ ధృవీకరణ పత్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ రెండు దుకాణాల్లో రూ.6.76 లక్షల విలువ చేసే 889 ప్యాకెట్ల విత్తన విక్రయాలను నిలుపుదల చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారాలన్న లక్ష్యంతో అధికారులు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ ప్రచారంలో భాగంగా బీచ్ వద్ద పర్యాటకులు, స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనన్ ఇన్‌నిస్టిట్యూట్ ఛైర్మనన్ విక్రమ్ నారాయణ ఉచితంగా జూట్ బ్యాగులను సమకూర్చారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల తీర ప్రాంత పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జనపనార (జూట్) సంచులను వినియోగించుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌న్‌చార్జి పర్యాటక శాఖ అధికారి సత్యపాల్ ఆనంద్, బీచ్ సూపర్‌వైజర్ జ్ఞానరాజు తదితరులు పాల్గొన్నారు.
యడ్లపాడు: కొండవీడు కోటను శనివారం పర్యాటకులు విశేషంగా సందర్శించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ చొరవతో చేపట్టిన ఈ పర్యాటక కార్యక్రమాలు శనివారం సాయంత్రం నుంచి కోట ప్రాంగణంలో ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పచ్చని కొండల నడుమ, ప్రకృతి సోయగాల మధ్య ఏర్పాటు చేసిన నైట్ టెంటెడ్ అకామడేషన్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. యువత, ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, సాంప్రదాయ ఆటలు, వినోదాత్మక గేమ్స్‌ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. పర్యాటకులకు అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, పల్నాడు జిల్లా టూరిజం కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు సాదర స్వాగతం పలికారు. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, కొండవీడును రాష్ట్రస్థాయి ఎకో–టూరిజం గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా సాగుతుందన్నారు.ఔట్ రైవల్ అడ్వెంచర్స్ డైరెక్టర్ దలవాయి ఆషా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తం రాజు, ఏబీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


