నరసరావుపేట: బక్రీద్ పండుగను ముస్లింలు సుహృద్భావ వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజన సింహ కోరారు. పండుగ నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాంస విక్రయాలను నిర్దేశిత ప్రాంతాలలోనే చేపట్టాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జీవాలను అక్రమంగా తరలించరాదని, జంతు వధలో నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి కోసం నోడల్ ఆఫీసర్‌గా అసిస్టెంట్ డైరెక్టరు శ్రీనివాసమూర్తిని నియమించామన్నారు. 88973 74437 ఫోనులో నంబరులో ఆయన్ను సంప్రదించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎస్పీ, ఆర్‌డీఓ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఒక కమిటీ, డివిజనల్ స్థాయిలో డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ఒక కమిటీ, మండల స్థాయిలో తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. వారు నిత్యం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
‘జలధార–జలహారతి’ పనులపై దృష్టి
నరసరావుపేట: రాష్ట్రంలో చేపట్టిన ‘జలధార– జలహారతి’ పనులను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజన సింహ అధికారులను ఆదేశించారు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో పురోగతి వివరాలు వెల్లడించారు. మొత్తం 736 పనులను గుర్తించగా, 635 పనులకు ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయన్నారు. ప్రస్తుతం 577 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా, 15 పనులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 43 పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రూ.19.32 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. జూన్ 30 నాటికి చెల్లింపులతో సహా అన్ని ప్రక్రియలను ముగించాలని స్పష్టం చేశారు. పీడీ డ్వామా సిద్ధ లింగమూర్తి, భూగర్భ జలాల శాఖ డీడీ రాంబాలాజీరెడ్డి, మైనర్ ఇరిగేషన్ డీఈ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజన సింహ


