క్రోసూరు: మండలంలోని నాగవరం గ్రామంలో ఈనెల 17వ తేదీన ఆస్తి కోసం వృద్ధురాలిని హత్య చేసిన హంతకులను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ పి.సురేష్, ఎస్‌ఐ పి.రవిబాబు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాగవరం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్‌వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వివాహం సమయంలో కట్నం ఇచ్చినప్పటికీ అదనపు కట్నంతోపాటు అత్త పేరున ఉన్న ఇంటిని రాయించుకురావాలని వేధిస్తున్నాడు. అదే సమయంలో తాకట్టులో పెట్టిన వెండి వస్తువుల గురించి అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్ తరచూ అడుగుతున్నారు. దీంతో వారిని హత్య చేస్తే అడ్డు తొలగిపోతుందని పథకం వేసుకున్నారు. దీంతో సాయంత్రం భార్య కరిష్మా, అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్(75), ఇర్ఫాన్‌లపై ఇనుపరాడ్లు, కర్రలు, కారంతో దాడిచేయగా వృద్ధురాలు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న మస్తాన్‌వలి, సోదరులు ఇమాంసా, షేక్ ఇబ్రహీం, తండ్రి షేక్ మస్తాన్ వలి, తల్లి షేక్ సైదాబిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు నాటు కర్రలు, రెండు ఇనుపరాడ్లు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.


