బంగారంలోనూ మాఫియా! | - | Sakshi
Sakshi News home page

బంగారంలోనూ మాఫియా!

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

బిల్లులు లేకుండా పసిడి విక్రయాలు ప్రభుత్వాలకు రూ.కోట్లల్లో పన్ను ఎగవేత రూ.45 లక్షలతో చిలకలూరిపేట పోలీసులకు చిక్కిన నరసరావుపేట వ్యాపారి విచారణలో వెలుగు చూసిన అక్రమ బంగారం నెట్‌వర్క్‌ సంబంధిత వ్యాపారుల్లో ఆందోళన గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న దందా

ప్రత్యేక నెట్‌వర్క్‌ ఏర్పాటు

చైన్నె నుంచి అక్రమంగా బంగారం బిస్కెట్ల రవాణా

ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో నష్టం

నరసరావుపేట టౌన్‌: నరసరావుపేట బంగారం వ్యాపారానికి ఎంత ప్రసిద్ధి చెందిందో.. అదే స్థాయిలో అక్రమ బంగారం వ్యాపారానికి కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అక్రమ మార్గంలో బంగారం రవాణాకు పాల్పడుతున్నారు. చైన్నె, కేరళం రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని బంగారం బిస్కెట్లను రహస్యంగా తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తూ కొందరు వ్యాపారులు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచటంతో అక్రమ వ్యాపారులకు కనకవర్షం కురిపిస్తోంది. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారంపై అధిక పన్నులు ఉండటంతో స్మగ్లింగ్‌ ద్వారా వచ్చే బంగారం మార్కెట్‌ ధర కంటే తక్కువకు లభిస్తోంది. ఈ తేడానే అక్రమార్కులకు భారీ లాభాలను చేకూర్చుతోంది. ఫలితంగా రోజు రూ.కోట్ల ల్లో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది.

రూ.45 లక్షలతో పట్టుబడ్డ మధ్యవర్తి

నరసరావుపేటకు చెందిన హనీఫ్‌ గత మంగళవారం చైన్నెలో అక్రమ బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా చిలకలూరిపేట రూరల్‌ పోలీసులకు చిక్కాడు. లెక్క చూపని సుమారు రూ.45 లక్షలు అతని వద్ద స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. దీంతో అక్రమ బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది. చైన్నెలో పన్ను చెల్లించని బంగారం బిస్కెట్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నరసరావుపేటలో కొంతమంది హోల్‌సేల్‌ వ్యాపారులకు కొన్నేళ్లుగా సరఫరా చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటివరకు కొంతమంది ముఠా వేల సంఖ్యలో బిస్కెట్లు రహస్యంగా తరలించి వ్యాపారులకు విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు హనీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో నరసరావుపేట అక్రమ వ్యాపారుల్లో వణుకు పుడుతోంది. తమ పేర్లు బయట పడతాయన్న భయంతో అప్రమత్తమైన వ్యాపారులు ఇప్పటికే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అజ్ఞాతంలోకి జారుకున్నారు. మరికొంత మంది వ్యాపారులు బంగారం నిల్వలను రహస్య ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది.

అక్రమ బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ పోలీసులకు రూ.45 లక్షల నగదుతో పట్టుబడ్డ నరసరావుపేట వాసి హనీఫ్‌ (ఫైల్‌)

అక్రమ బంగారం వ్యాపారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. చట్టబద్ధంగా దిగుమతి చేసుకొనే బంగారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అయితే స్మగ్లింగ్‌ ద్వారా వచ్చే బంగారం మార్కెట్‌లోకి చేరటంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల మేరకు గండి పడుతోంది.

విదేశాల నుంచి అక్రమంగా వచ్చే బంగారం మార్కెట్‌ ధరకంటే తక్కువగా లభిస్తుండటంతో ఒక్కో బిస్కట్‌పై సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లాభం వస్తుందని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో బంగారంపై ఉన్న 6 శాతం ట్యాక్స్‌ను ఇటీవల 15 శాతానికి పెంచటంతో అక్రమ రవాణాకు మరింత ప్రోత్సాహం పెరిగింది. దిగుమతి పన్నులు చెల్లించకుండా తక్కువ ధరకు వచ్చిన బంగారాన్ని స్థానిక మార్కెట్‌లో జీఎస్టీ సైతం లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. బహిరంగ ధర కంటే కొంత తక్కువ ధరకు విక్రయించడం ద్వారా కస్టమర్‌లను ఆకర్షించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో వ్యాపారుల్లో ఎక్కువ శాతం ఈ అక్రమ కార్యకలాపాలకు మొగ్గు చూపుతున్నారు.

ఈ బంగారం అక్రమ వ్యాపారం ఒకరిద్దరితో పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. చైన్నె, కేరళం రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వ్యక్తులు, రవాణా చేసే యువకులు వాటిని దాచిపెట్టి చివరకు మార్కెట్‌లో విక్రయించే వ్యాపారులు ఇలా ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మార్కెట్‌లో బిల్లులు లేని బంగారం బిస్కెట్‌లను కోడ్‌ భాషలో (ఎస్‌పీ) అని పిలుస్తున్నారు. సాధారణ వ్యాపార లావాదేవీల మాదిరి కాకుండా రహస్య సంకేతాలతో ఈ వ్యాపారం సాగుతొంది. స్మగ్లింగ్‌ ముఠా ప్రతి రోజు నలుగురు నుంచి ఐదుగురు యువకులను చైన్నెకు పంపుతున్నట్లు సమాచారం. అక్కడ బిల్లులు లేని బంగారం బిస్కెట్‌లను కొనుగోలు చేసి బస్సులు, రైలు మార్గం ద్వారా నరసరావుపేటకు తీసుకొస్తున్నారు. కొంత మంది యువకులకు ఇది ఉపాధిగా మారింది. పట్టుబడితే ప్రధాన నిందితుల వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు నిర్వాహకులు తెరవెనుక మంతనాలు నడుపుతారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement