పిడుగురాళ్లపై భానుడి పగ | - | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లపై భానుడి పగ

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

● రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్న ఉష్ణోగ్రతలు ● పట్టణంలోని భారీ చెట్లను అడ్డగోలుగా నరకడమే కారణం ● ఎండ దెబ్బకి సున్నపు పరిశ్రమలో కనిపించని కూలీలు ● పట్టపగలే జనాలు లేక నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు

పిడుగురాళ్ల: ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని పిడుగురాళ్ల ప్రాంతంలో ఎండ తీవ్రత భారీగా స్థాయిలో పెరిగింది. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా గత రెండు రోజుల్లో 47. 6 నుంచి 48.1 డిగ్రీల వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ ప్రాంత ప్రజలు షాక్‌ అయ్యేలా నమోదు అయ్యాయి. అదే క్రమంలో శుక్రవారం కూడా అత్యల్పంగా 31 డిగ్రీల నుంచి అత్యధికంగా 46.8 డిగ్రీల వరకు నమోదు అయింది. మరో వారం రోజులపాటు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎండ దెబ్బకు ప్రజల రాకపోకలకు కూడా ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్‌ సైతం మధ్యాహ్న సమయంలో ఖాళీగా దర్శనమిచ్చింది. నిత్యం ప్రజలతో, వ్యాపారులతో కళకళలాడే ఐలాండ్‌ సెంటర్‌, పిల్లుట్ల రోడ్డు నిర్మానుష్యంగా మారాయి. చిరు వ్యాపారులు సైతం తోపుడు బండ్లపై దుప్పట్లు వంటివి ఏర్పాటు చేసుకొన్నారు. అత్యవసరంగా బయటకు వచ్చే మహిళలు, యువకులు టవల్‌, ఇతర వస్త్రాలు వంటివి ధరిస్తున్నారు. చిన్నారులు ట్యూషన్‌కు వెళ్లేందుకు తలకు రుమాళ్లు ధరించి, గొడుగులు వేసుకొని వెళ్తున్నారు.

పరిశ్రమలు ఎక్కువ... చెట్లు తక్కువ...

పిడుగురాళ్ల పట్టణంలో సున్నపు పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో లైమ్‌ సిటీ అనే పేరు వచ్చింది. ఈ లైమ్‌సిటీలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, చెట్లు లేకపోవటంతో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. దీనికి తోడుగా పిడుగురాళ్ల బైపాస్‌ రోడ్డు, అద్దంకి నార్కెట్‌పల్లి నిర్మించే సమయంలో పెద్ద పెద్ద చెట్లను అడ్డగోలుగా తొలగించారు. తిరిగి రోడ్లను నిర్మించిన తర్వాత మొక్కలను నాటలేదు. ఇటీవలే జానపాడు రోడ్డులో కూడా రైల్వే బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు విస్తరణలో భాగంగా భారీ చెట్లను తొలగించారు. తిరిగి మొక్కలు నాటలేదు. అలాగే పట్టణంలో కూడా రోడ్డు విస్తరణ చేసినపుడు పెద్ద చెట్లను తొలగించారు. పిల్లుట్ల రోడ్డు విస్తరణ, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా మొక్కలు నాటక పోవటంతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సున్నపు పరిశ్రమలో బొగ్గురాయిని కాల్చి సున్నంలా తయారు చేసే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతలలో కాల్చటం కూడా కారణంగా చెబుతున్నారు. భూగర్భజలాలలో ఉన్న రాయిని వెలికి తీయటం వలన కూడా ప్రకృతిలో ఉష్ణోగ్రతలు మార్పులు జరగటం వలన గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలోనే పిడుగురాళ్లలో అత్యధికంగా నమోదు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

మధ్యాహ్న సమయంలో ఖాళీగా దర్శనమిస్తున్న ఐలాండ్‌ సెంటర్‌

కూలీలు లేక ఖాళీగా దర్శనమిస్తున్న సున్నపు పరిశ్రమ

Advertisement
 
Advertisement
Advertisement