రైతులపై రుణ భారం | - | Sakshi
Sakshi News home page

రైతులపై రుణ భారం

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

చంద్రబాబు ప్రభుత్వంలో ఇంతే

బ్యాంకుల్లో రుణాల రెన్యూవల్‌కు తీవ్ర ఇబ్బందులు చేసేది లేక అధిక వడ్డీలకు బయట అప్పులు చేస్తున్న రైతులు యథావిధిగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు

చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, మధ్యతరగతి వర్గాల బతుకులు అధ్వానంగా మారాయి. పంట సాగు చేయడం మొదలు దాన్ని విక్రయించే వరకూ నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినా పరిహారం సొమ్ములు రాక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా అన్నదాతలను రెన్యూవల్‌ కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. పంట, బంగారం రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ కట్టాలంటూ బ్యాంకులు తేల్చి చెబుతుండడంతో వడ్డీ వ్యాపారులు కర్షకులు ఆశ్రయించి నష్టపోతున్నారు.

సత్తెనపల్లి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన కొత్త బంగారు, పంట రుణాల నిబంధనలు రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి. గతంలో కేవలం వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను మరో ఏడాది పాటు రెన్యూవల్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం అసలు, వడ్డీ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తేనే పాత అప్పును క్లోజ్‌ చేసి... ఒక రోజు తరువాత మళ్లీ కొత్త రుణం మంజూరు చేస్తున్నారు. ఈ విధానంతో రైతులే కాకుండా చిరు వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

అన్నదాతలకు కష్టాలు

జిల్లాలో వ్యవసాయ పెట్టుబడులు, వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో పంట రుణాలు, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందడం సర్వసాధారణం. బ్యాంకుల్లో పంట, బంగారు రుణాలు తీసుకున్న రైతులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సాధారణంగా మే, జూన్‌, జూలై మాసాల్లో వ్యవసాయం కోసం పట్టాదారు పాస్‌పుస్తకాలు పెట్టి రుణాలు తీసు కుంటారు. మరి కొందరు బంగారు ఆభరణాలు కుదవ పెట్టి రుణాలు తీసుకుంటారు. వాటిని ఏటా వడ్డీ చెల్లించి రెన్యూవల్‌ చేసుకుంటారు. అయితే బ్యాంకుల్లో తీసు కున్న అప్పునకు వడ్డీ కడితే చాలు రెన్యూవల్‌ చేస్తారు. అయితే ప్రస్తుతం బ్యాంకులు వడ్డీతో పాటు గత ఏడాది తీసుకున్న అసలుతో కలిపి చెల్లించి రెన్యూవల్‌ చేయించుకోవాలనే నిబంధనలు పెట్టారు.

దోచుకుంటున్న వడ్డీవ్యాపారులు

రెక్కాడితే కానీ డొక్కాడని రైతన్నలు రుణాలు రెన్యూవల్‌ చేయించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అసలుతోపాటు వడ్డీ కట్టాలని బ్యాంకర్లు చెబుతుండడంతో చేసేదిలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వడ్డీ వ్యాపారులు బ్యాంకుల ముందే తిష్ట వేసి డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న రైతులను గుర్తించి వారికి అధిక వడ్డీలకు ఇచ్చి దోచుకుంటున్నారు. వారం వ్యవధిలో చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని బ్యాంకులో ఉన్న అసలు, వడ్డీ డబ్బులు అందిస్తున్నారు. బ్యాంకులు రెన్యూవల్‌ చేసిన రోజే డబ్బు తిరిగి రైతుకు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకులు రుణ మొత్తాన్ని వారం రోజులకు చెల్లిస్తుండడంతో వడ్డీ వ్యాపారులకు అడిగినంత చెల్లించాల్సిన దుస్థితి. జిల్లాలో అత్యధికంగా రైతులు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, సహకార పరపతి సంఘాల్లో వ్యవసాయ పంట రుణాలు, బంగారు రుణాలు తీసుకుంటారు. రూ. లక్షకు వారానికి వడ్డీ రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పాత విధానాన్ని కొనసాగించాలని రైతులు, పేద, మధ్య తరగతి కుటుంబాలు మొర పెట్టుకుంటున్నాయి. కేవలం వడ్డీ మాత్రమే తీసుకొని పునరుద్ధరించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులను అప్పు కోసం ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని వారు పేర్కొంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఏదీ కలిసి రావడం లేదు. సంక్షేమ పథకాలు అందక, గిట్టుబాటు ధరలు లేక, పంట నష్టపరిహారం అందక, ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వడ్డీ వ్యాపారులు చేతికి చిక్కి రైతులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం ఎన్ని అగచాట్లు పడాలో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేదని, ప్రభుత్వం కనీసం ఈ ఏడాదైనా అన్నదాత సుఖీభవ మొత్తాన్ని ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో ఈసారి వ్యవసాయం కత్తి మీద సామే అవుతుందంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement