పలు రైళ్లు తాత్కాలిక రద్దు | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు తాత్కాలిక రద్దు

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

పలు రైళ్లు తాత్కాలిక రద్దు వినుకొండలో భారీ చోరీ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి శంకుస్థాపన డాక్టర్‌ శోభారాణికి అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని రైల్వే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఉన్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్‌ పీఆర్‌ఓ వినయ్‌కాంత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ – గుంటూరు(రైలు నంబర్‌ 57201), గుంటూరు – మాచర్ల (57203), మాచర్ల – నడికుడి (57206), నడికుడి–మాచర్ల (57205), మాచర్ల –గుంటూరు (57204), గుంటూరు – విజయవాడ (57202), విజయవాడ – గుంటూరు (67229), గుంటూరు–రేపల్లె (67223), రేపల్లె–తెనాలి (67224), తెనాలి– విజయవాడ (67222), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె– తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233), రేపల్లె–గుంటూరు (67234), గుంటూరు– రేపల్లె (67235), మార్కాపురం రోడ్‌ – తెనాలి (67239), తెనాలి – గుంటూరు (67236), గుంతకల్లు–మార్కాపురం రోడ్‌ (57407) రైళ్లు ఈనెల 23, 24, 30, 31 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు. మార్కాపురం రోడ్డు– గుంతకల్లు (నంబర్‌ 57408) రైలు ఈ నెల 24, 25, 30, జూన్‌ 01వ తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రేపల్లె –మార్కాపురం రోడ్డు (67238) రైలు గుంటూరు, మార్కాపురం రోడ్డు మీదుగా ఈనెల 23, 24, 30, 31 తేదీల్లో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వేక్షిత్‌ జ్యూయలర్స్‌లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను, నగదును అపహరించారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. షాపు లోపల డిజిటల్‌ వీడియో రికార్డు బాక్స్‌ని, సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. షాపులో పోలీస్‌ కుక్కలు పసికట్టకుండా కారం చల్లినట్లు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన గోల్డ్‌ షాపులో ఇలాంటి భారీ చోరీ జరగడంతో స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

గుంటూరు రూరల్‌: మండలంలోని చిన్నపలకలూరు రైల్వే గేట్‌ వద్ద నల్లపాడు–బండారుపల్లి స్టేషన్ల మధ్య రైల్వే గేట్‌ రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఆర్‌ఓబీ) నిర్మాణానికి శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టీనా పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, మెరుగైన కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా భద్రతను పెంపొందించడం అవసరమన్నారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ జి.శోభారాణికి అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. గతేడాది ఆగస్టు నుంచి ఇన్‌చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు, పల్నాడుజిల్లా డీఎంహెచ్‌ఓగా గతంలో విధులు నిర్వహించారు. రీజనల్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబరేటరీలో సివిల్‌ సర్జన్‌ బ్యాక్టీరియాలజిస్టుగా పనిచేస్తూ ఇన్‌చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. జి.శోభరాణిని ఆర్టీ కార్యాలయం డీడీ పాల్‌ సుధాకర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌లు సత్యం, విజయకుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లు శ్రీక్రాంత్‌, బి.శ్యామ్‌అనిల్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement