రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

గురజాల రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన నగర పంచాయతీలోని శ్రీరాంపురం రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... రెంటచింతల మండలం పాత పాలువాయి గ్రామానికి చెందిన దేరంగుల బంగారి, దేరంగుల భాస్కర్‌, ఉప్పుతోళ్ల వెంకయ్యలు ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వెళ్లేందుకు బయలుదేరారు. మార్గంమధ్యలో గురజాలలోని కారంపూడి రోడ్డులో డివైడర్‌ వద్ద కారు టర్నింగ్‌ చేస్తుండగా వెనుక వచ్చి ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేరంగుల బంగారి అక్కడిక్కడే మృతిచెందగా దేరంగుల భాస్కర్‌, ఉప్పుతోళ్ల వెంకయ్యలను 108 వాహనం ద్వారా గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. మార్గంమధ్యలో దేరంగుల భాస్కర్‌ మృతిచెందగా ఉప్పుతోళ్ల వెంకయ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాలువాయిలో విషాదం

రెంటచింతల: మా ఇంటి దీపాలు ఆరిపోయాయి...మేం ఎవరి కోసం బతకాలి అంటూ ఆ కన్నతల్లులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోధిస్తున్న తీరు అక్కడినున్న వారిని కంటితడి పెట్టించింది. మృతి చెందిన బంగారి, భాస్కర్‌లు వరుసకు అన్నదమ్ములు. వెంకయ్య వారికి వరసకు బావమరిది. ముగ్గురూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారని వారి బంధువులు తెలిపారు. కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలకు ఒక్కొక్కరే కుమారులు. వీరు ఈ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ‘మేం ఏ పాపం చేశామయ్యా... 20 సంవత్సరాలుగా మా కంటి పాపలా చూసుకుంటే ఎదిగిన కుమారులు మా కళ్లముందు రక్తపు మడుగులో పడిపోయారు... దేవుడు మాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు...’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చలించిపోయారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతోపాటు మరో యువకుడు మృత్యువుతో పోరాడుతుండటంతో పాలువాయి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. చూపరులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement