నరసరావుపేట టౌన్: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. విజేత థియేటర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెంది ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ కోరారు.
యడ్లపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రమైన యడ్లపాడు 16వ జాతీయరహదారిపై రామాలయం సమీపాన ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటుతుండగా అదే సమయంలో వేగంగా వస్తున్న వాహనం అతన్ని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నిలుపుదల చేయకుండా వెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, అతని వయస్సు సుమారు 35 నుండి 45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతను భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా భావిస్తున్నామని తమ ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.
వినుకొండ: పట్టణంలోని పాత ఎల్‌ఐసి బిల్డింగ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలిన వెంటనే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు అప్రమత్తమై, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు.


