నరసరావుపేట టౌన్: ముస్లిం మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకులు శుక్రవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత కొన్ని నెలలుగా వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటంతో రోజురోజుకు అతని ఆగడాలు పెరిగిపోయాయన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ముస్లిం మహిళ పట్ల దారుణంగా వ్యాఖ్యలు చేశాడన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు మస్తాన్‌వలి, మౌలాలి, లియాజ్ బాషా తదితరులు ఉన్నారు.
గుంటూరు మెడికల్: పిడుగురాళ్ల ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి జరుగుతున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.వి.సుందరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశం శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని డీసీఆర్ సమావేశ మందిరంలో నిర్వహించబడనని వెల్లడించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులు, ఇతర అంశాలు ఉన్న అభ్యర్థులు అవసరమైన ఆధారాలతో హాజరై తమ అభ్యంతరాలను డీపీసీ సభ్యుల ముందు వినిపించవచ్చని తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పారదర్శకంగా పరిశీలించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి పేర్కొన్నారు.
భువనగిరి(బీబీనగర్): ఏపీని నుంచి వలస వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురగోముల గ్రామంలో డెయిరీ ఫాంలో పనిచేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల శౌరిబాబు తన భార్య మౌనికతో కలిసి నెమురగోముల గ్రామంలోని ఓ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా శౌరిబాబు పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వెళ్తుంటాడు. గత రెండు నెలలుగా పింఛన్ కోసం స్వగ్రామానికి వెళ్లకపోవడంతో అతడి సోదరుడు మల్లేశ్వర్‌రావు శుక్రవారం నెమురగోముల గ్రామానికి వచ్చాడు. ఇక్కడ శౌరిబాబు లేకపోవడం, అతడి భార్య పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.


