తెనాలి: ‘పేరు మార్చాలంటే ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వాల్సిందే’...శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. అధికారులు క్రమశిక్షణ చర్యలకు దిగారు. పట్టణంలో కొత్తగా వివిధ అపార్టుమెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు, తమ పేరిట పన్ను విధింపునకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 మంది దరఖాస్తుదారులు, ఆ పరిధిలోని సచివాలయం బాధ్యతలు చూస్తున్న మున్సిపల్ ఉద్యోగిని కలిసి పన్ను మార్పు చేయించమని కోరారు. సదరు ఉద్యోగి రెండు ల్యాప్‌ట్యాప్‌లు కొని ఇస్తేనే పేరు మార్పు చేస్తానని షరతు విధించారు. నెలలు గడుస్తున్నా ఇంటి పన్నుకు పేరు మారకపోవటంతో ప్లాట్ల యజమానులు మున్సిపల్ అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. దీనిపై అధికారులు విచారించినపుడు ఆ ఉద్యోగి వాస్తవమేనని అంగీకరించాడు. హెచ్చరికలతో వదిలేసిన అధికారులు ఈ వ్యవహారమంతా ‘సాక్షి’లో ప్రచురితం కావటంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. గురువారం రాత్రి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంటు ఏడుకొండలుకు షోకాజ్ నోటీసు జారీచేశారు. సమాధానం ప్రకారం అనంతర చర్యలు ఉంటాయని అధికారులు తెలియజేశారు.


