చక్కటి ప్లాట్‌ పామ్‌ | - | Sakshi
Sakshi News home page

చక్కటి ప్లాట్‌ పామ్‌

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

చక్కటి ప్లాట్‌ పామ్‌ జిల్లాలో విస్తరిస్తున్న ఆయిల్‌ పామ్‌ సాగు నష్టాల నుంచి బయటపడేసే

వరుస నష్టాల నేపథ్యంలో ఇటు మొగ్గు

కంపెనీ ఏర్పాటుతో మరింత ఊతం

ఉచితంగా మొక్కలు..

జిల్లాలో విస్తరిస్తున్న ఆయిల్‌ పామ్‌ సాగు

సాక్షి, నరసరావుపేట: పల్నాడు రైతులకు గత రెండేళ్లుగా వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లా రైతులు అధికంగా పండించే మిర్చి సాగు చేసినా ఒక్కోసారి కనీసం పెట్టుబడి రాకపోగా అప్పుల పాలవుతున్నారు. మరోవైపు పత్తికి పంటకు చీడపీడలు అధికంగా వస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదు. పొగాకు కొనేవారు లేక రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెట్ట రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలని ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆయిల్‌ పామ్‌ తోటలంటే పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలే గుర్తుకువస్తాయి. రెండు మూడేళ్లుగా పల్నాడులో ఆయిల్‌ పామ్‌ సాగు క్రమంగా పెరుగుతోంది. సాగుకు అనుకూల వాతావరణం, భూసారం, నీటి లభ్యత వంటి అంశాలపై ఉద్యాన శాఖ చేసిన సర్వేలో తొలి విడతలో 8 మండలాలను అనుకూలంగా గుర్తించారు. ఇందులో పిడుగురాళ్ల, అమరావతి, రాజుపాలెం, బెల్లంకొండ, నాదెండ్ల, ఈపూరు, మాచవరం, సత్తెనపల్లి మండలాలు ఉన్నాయి. సాగు చేసిన రైతుల నుంచి ఆయిల్‌ పామ్‌ గెలలను నేరుగా పొలంలోనే కొనుగోలు చేస్తారు. వ్యాల్యూ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సర్వీసెస్‌ సంస్థకు ఆరు మండలాలు, గోద్రేజ్‌ ఆగ్రోవేట్‌ సంస్థకు రెండు మండలాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆయా రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగులో మెలకువలు నేర్పడంతోపాటు మద్దతు ధరకే ఆయిల్‌ పామ్‌ గెలలను కొనుగోలు చేస్తాయి.

7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం...

పల్నాడు జిల్లా వ్యాప్తంగా తొలివిడతలో 8 మండలాల పరిధిలో రెండు కంపెనీల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,236 మంది రైతులు 2,906 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేశారు. ఈ ఏడాది 23 మండలాల పరిధిలో నాలుగు కంపెనీల ఆధ్వర్యంలో సుమారు 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఆయిల్‌ పామ్‌ దిగుమతిపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం రైతులకు ప్రోత్సహకాలు అందిస్తోంది. అందుకు వంట నూనెల మిషన్‌ ఏర్పాటు చేసి ఆయిల్‌ పామ్‌ సాగు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు మొక్కలను ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరానికి 52 మొక్కలను 9/9 మీటర్లకు ఒకటి చొప్పున నాటాల్సి ఉంది. హెక్టారుకు 130 మొక్కలను ఉచితంగా అందజేస్తారు. ఒక మొక్కకు రూ.193 చొప్పున 130 మొక్కలకు కలిపి రూ.25,090 రాయితీ లభిస్తుంది. తోట నిర్వహణకు హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగేళ్లపాటు అందిస్తారు. అంతర పంటల సాగుకు మరో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.5,250 చొప్పున అందజేయనున్నారు. మొత్తం నాలుగేళ్లలో హెక్టాకు రైతుకు రూ.67,090 వరకు అందనుంది. బిందు సేద్యం పరికరాలను సైతం రాయితీపై అందజేస్తారు. విద్యుత్‌ సౌకర్యం లేని రైతులకు పీఎం–కుసుమ పథకం ద్వారా సోలార్‌ మోటార్లు అందిస్తారు. ఆయిల్‌ పామ్‌ హెక్టారుకు సగటున 25 నుంచి 30 టన్నుల గెలలు దిగుబడి అవుతుంది. టన్ను ధర సుమారుగా రూ.18 వేల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు.

రెండు ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేశా. గతంలో పండిస్తున్న కూరగాయలను అంతరపంటగా వేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఎరువులు, మొక్కలు రాయితీ మీద వస్తున్నాయి. పండించిన పంటను స్థానికంగా బల్క్‌ డిపోకు తరలించి కంపెనీలకు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో పల్నాడులో ఆయిల్‌ పామ్‌ ఆధారిత కంపెనీలు ఏర్పడితే రైతులకు మార్కెటింగ్‌ అవకాశాలు పెరిగి మరింత సాగుకు ఊతం లభిస్తుంది.

– నారిశెట్టి చంద్రయ్య,

రైతు, గణపవరం, నాదెండ్ల మండలం

పల్నాడు జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ కృషి చేస్తోంది. ఎంపిక చేసిన 8 మండలాల్లో ఇప్పటికే 2,906 ఎకరాల్లో పామ్‌ సాగైంది. పామాయిల్‌ మొక్కలను రైతులకు ఉచితంగా అందజేస్తాం. సాగుకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు అంతర్‌ పంటల సాగుకు రాయితీ అందిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో సాగును మరింత పెంచుతాం.

– ఇంటూరు వెంకట్రావు,

పల్నాడు జిల్లా ఉద్యానశాఖ అధికారి

తొలి దశలో 8 మండలాల్లో ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా 1,408

ఎకరాల్లో ఇప్పటికే తోటలు

ఉచితంగా మొక్కల పంపిణీ, డ్రిప్‌,

అంతర పంటలకు సబ్సిడీ

మిర్చి, పత్తి వంటి పంటల నష్టాల నుంచి తేరుకునేందుకు మొగ్గు చూపుతున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement