● ‘సాక్షి’ కథనానికి స్పందించిన జిల్లా
సహకార అధికారి ఎం.నాగరాజు
● రైతుల ఫిర్యాదుతో విచారణ
● అధికారుల విచారణతో
వెలుగులోకి అక్రమాలు
● సొసైటీలో తనిఖీలు
నిర్వహించాలని ఆదేశం
● అదేశాలను నిలిపివేస్తూ
రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ
నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆర్థిక, పరిపాలనపరమైన అవకతవకలు జరిగినట్టు జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు స్పష్టంచేశారు. రైతుల ఫిర్యా దుతో జరిపిన విచారణలో అవకతవకలు వెలుగు చూసినట్టు తెలిపారు. సహకార చట్టం సెక్షన్ 52 కింద పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23వ తేదీన తనిఖీలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. సొసైటీలో అక్రమాలపై ‘అక్రమాలకు సహకారం’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై నాగరాజు స్పందించారు. అన్నవరం పీఏసీఎస్‌లో అవకతవకలు జరిగాయని, సొసైటి సీఈథో దొప్పలపూడి శ్రీనివాసరావు, అప్పటి అధికార పర్సన్ ఇన్‌చార్జ్ నర్రా సురేంద్రబాబు వీటికి పాల్పడినట్టు సొసైటీ పరిధిలోని 45మంది రైతులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదుపై సహకార శాఖ సీనియర్ ఇన్‌స్పెక్టర్ డి.రవికుమార్‌ను విచారణ జరిపి ఆర్ధిక, పాలనాపరమైన అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు తెలిపారు. సహకార చట్టం సెక్షన్ 52 ప్రకారం సొసైటీ తనిఖీ నిర్వహించాలని ఆయన సిఫార్స్ చేసినట్టు వివరించారు. ఈ మేరకు సొసైటీలో తనిఖీలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం తదు పరి ఉత్తర్వులు వచ్చేవరకు తనిఖీలు నిలిపివేస్తూ ఈ నెల 23వ తేదీన మెమో ద్వారా ఆదేశించినట్టు తెలిపారు. సొసైటీలో అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తనిఖీ లు నిలిపివేస్తూ ఆదేశాలు తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు కొనసాగి ఉంటే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చేవని వారు చెబుతున్నారు.


