అనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

అనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

అనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు

యడ్లపాడు: కార్మికుల సంక్షేమాన్ని, సామాజిక బాధ్యతను అత్యున్నత ప్రాధాన్యతగా భావించే బోయపాలెంలోని శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లుకు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు దక్కింది. మేడే సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏటా అందించే ఈ అవార్డులు ఈ ఏడాది విజయవాడ కేంద్రంగా ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు పరిశ్రమల యాజమన్యాలు అందుకున్నాయి. కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలో విశేష కృషి చేసిన సంస్థలను ప్రభుత్వం గుర్తించి వీటిని అందించనట్లు ఆశాఖ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో పల్నాడు జిల్లా బోయపాలెంకు చెందిన శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లు సంస్థ ఎండీ సామినేని కోటేశ్వరరావు, ఈడీ ఫణికుమార్‌ మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. మిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ గుర్తింపు పరిశ్రమల నిబద్ధతను మరింత పెంచుతాయన్నారు. సంస్థకు దక్కిన ఈ గౌరవం కేవలం తమ ఒక్కరిది మాత్రమే కాదని, కార్మికులందరి సహకారం అన్నారు. అలాగే ఈ అవార్డు జిల్లాతో పాటు ఇది ఏపీ టెక్స్‌టైల్‌ రంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు, కార్మిక కమిషనర్‌ గంధం చంద్రుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement