మరొకరికి తీవ్ర గాయాలు
నరసరావుపేట రూరల్: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని జొన్నలగడ్డ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. నాదెండ్ల మండలం జంగాలపల్లికి చెందిన మద్ది శ్రీకాంత్(24) పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పట్టణంలో పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమై వస్తుండగా.. జొన్నలగడ్డ చప్టా వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నల్లపాడుకు చెందిన వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేష్‌ను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ కిషోర్ తెలిపారు.


