హాజరైన నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, ప్రజలు మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే ఇంధన ధరలు అధికం పెట్రోల్ బంకుల వద్ద నిరసన, ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు బాబు ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండగట్టిన వైఎస్సార్ సీపీ నేతలు ఇంధన ధరల పెరుగుదలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై భారం
ధరలు పెంచడమే విజనా?
వినుకొండలో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే
బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులు
లింగంగుంట్లలో పెట్రలో బంక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి, పార్టీ శ్రేణులు
సాక్షి, నరసరావుపేట: ప్రజల నడ్డివిరిచేలా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, వాటి భారాన్ని వెంటనే తగ్గించాలని వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పల్నాడు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే ఇంధన భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. రిక్షాలు, సైకిళ్లు తొక్కుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. సామాన్య ప్రజలు సైతం పెద్దఎత్తున పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.
ధరలు వెంటనే తగ్గించాలి
ఎన్నికలలో ఓట్లు, సీట్లు కోసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామినిచ్చి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల పై భారం మోపుతున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, తగిన సమయంలో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఽనిరసన, ధర్నాలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మంటలను తగ్గించాలని ఆయన డిమాంద్ చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారన్నారు.
సామాన్యులపై భారం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామన్యులపై అధిక భారం పడుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ సోమవారం నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి లింగంగుంట్లలోని ప్రభుత్వ పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంక్ వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ట్‌కు వెళ్లి ఇంచార్జి కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ 2014– 2019 మద్యకాలంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.4లు వ్యాట్‌ను అప్పటి చంద్రబాబు వసూళ్లు చేసిందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హాయాంలో ఎప్పుడూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదని స్పష్టంచేశారు.
ఇక్కడే రూ.10 అధనం..
వినుకొండలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ పరిశీలకులు బాసు లింగారెడ్డిల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లాయర్స్ స్ట్రీట్, నరసరావుపేట రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మురళికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన మాటల కోటలు దాటించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయిల్ ధరలు తక్కువగా ఉంటే... మన రాష్ట్రంలో లీటరుకు రూ.10 అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు.
పెదకూరపాడులో భారీ ర్యాలీ..
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు ఆదేశాల మేరకు పెదకూరపాడులో సోమవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి భారీ ర్యాలీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ జెండా చెట్టు మీదగా కచే రీ సెంటర్ మీదగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు, తాడికొండ నియోజకవర్గ పరిశీలకులు ఈదా సామి రెడ్డి, ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య తదితరులు మాట్లాడారు. అనంతరం పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిల్ ధరలు అధికం
పెట్రో ధరల పెంపులో దేశంలోనే రాష్ట్రానికి అగ్రస్థానం దక్కుతుందని మాజీ మంత్రి విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం చిలకలూరిపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని మాజీ మంత్రి రజిని నివాసం వద్ద నుంచి పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కాలినడకన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విడదల రజని మాట్లాడుతూ ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి తరుణంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాల్సి పోయి, మరింత పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం దారుణ భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతి పక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
సంపద సృష్టి ఇదేనా..?
గల్లీగల్లీ తిరిగి చంద్రబాబునాయుడు సంపద సృష్టిస్తానని, సృష్టించిన సంపదతో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి సంపద సృష్టించకుండా అప్పులను సృష్టిస్తున్నాడని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పెట్రో ధరలు తగ్గించాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పిడుగురాళ్లలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం డీటీ శర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే ఇంధన ధరలు అత్యధికమన్నారు. పెట్రో ధరల పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో డాక్టర్ గజ్జల రిక్షా తొక్కుతూ శ్యాంసుందర్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ వరకు చేరు కొని నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, నిత్యావసరాలు, ఇలా అనేక రకాల ధరలు పెంచుకుంటూ పోయారన్నారు. ధరలు పెంచడమే బాబు విజన్ అంటూ ఎద్దేవా చేశారు.


