వినుకొండ: పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌పై ఓ యువకుడు ఎక్కి గంటపాటు హల్‌చల్ చేశాడు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు చెందిన కందుకూరి కాటంరాజు సోమవారం సాయంత్రం టవర్ ఎక్కాడు. తన భార్య భాను సుమారు ఏడాది కిందట రెండో వివాహం చేసుకున్న తరువాత తనతో కలిసి ఉండటం లేదని, వెంటనే కాపురానికి రావాలని డిమాండ్ చేస్తూ టవర్‌పైకి ఎక్కినట్లు సమాచారం. టవర్‌పై నిలబడి యువకుడు కొంతసేపు ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడితో మాట్లాడారు. కుటుంబసభ్యులు, స్థానికులు కలిసి నచ్చజెప్పడంతో చివరకు అతను సురక్షితంగా టవర్ దిగివచ్చాడు. ఈ ఘటనతో నరసరావుపేట రోడ్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. యువకుడు టవర్ దిగడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.


