నరసరావుపేట: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఆశ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని బాధిత కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రామస్థాయిలో అధికార పార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు డి.శివకుమారి మాట్లాడుతూ గతంలో ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కొంతకాలం వేధింపులు తగ్గినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ నూజెండ్ల, శావల్యాపురం, బొల్లాపల్లి, కారంపూడి తదితర మండలాల్లో ఆశా కార్యకర్తలపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని అన్నారు. రాజకీయ కారణాలతో ఉద్యోగ పరంగా ఇబ్బందులు సృష్టించడం, తప్పుడు ఆరోపణలు చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల విషయంలో అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని రక్షణ కల్పించాలని, రాజకీయ వేధింపులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రత్నకుమారి, కోశాధికారి ధనలక్ష్మి వేధింపులు ఎదుర్కొంటున్న ఆశాలు పాల్గొన్నారు.
ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా


