నిరసనకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

నిరసనకు సిద్ధం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

నేడు వైఎస్సార్‌ సీపీ నిరసన గళం

పాలకుల నిర్ణయంతో జిల్లా ప్రజలపై అదనపు బాదుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నెలకు రూ.6.34 కోట్ల భారం ఆందోళన చెందుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలు నేడు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిరసన

‘పెట్రో’భారంపై

సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లు ఇచ్చిన హామీలు అంతా మోసమేనని తేలుతోంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని అప్పట్లో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ధరలు తగించకపోగా పెంచుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్‌ చార్జీల పెంపు, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. యుద్ధ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ పాలకులు మంట పెట్టారు. లీటర్‌ పెట్రోల్‌పై రూ. 3.35, డీజిల్‌పై రూ.3.16 చొప్పున ధర పెంచడంతో ప్రత్యక్షంగా వాహనదారులపై ఆ భారం పడింది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు సహా అన్ని రకాల సామగ్రిపై పడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ తీరుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రూ.కోట్లల్లో భారం

జిల్లావ్యాప్తంగా 194 పెట్రోల్‌, డీజిల్‌ బంకులు (ఫిల్లింగ్‌ స్టేషన్‌లు) ఉన్నాయి. రోజుకు జిల్లాలో 4.20 లక్షల లీటర్ల డీజిల్‌, 2.35 లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలతో జిల్లాలో పెట్రోల్‌ లీటరు రూ.113కు చేరింది. డీజిల్‌ రూ. 100.69కి పెరిగింది. ఆ ప్రకారం నెలకు మొత్తం దాదాపు రూ.6.34 కోట్ల మేర భారం అదనంగా పడుతోంది. మరోవైపు దాదాపు అన్ని రంగాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా రవాణా రంగాన్ని ఈ పెంపు నిర్ణయం సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసరాలు, వంటనూనెలు, కూరగాయలు, ఇలా అన్ని రకాల వస్తువులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దిగుమతి, ఎగుమతి చేస్తుంటారు. ఇంధన ధరల పెంపుతో వీటి ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడి గత నెలలో వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వారం రోజులపాటు పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలను రేషన్‌ విధించారు. వరి కోతలపై ప్రభావం పడి రైతులు సకాలంలో పనులు చేయలేకపోయారు. ఫలితంగా అకాల వర్షాలతో కొంత నష్టపోయారు.

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంపై వైఎస్సార్‌ సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసన చేపట్టనున్నారు. ఆర్డీవోలు, తహసీల్దారులకు వినతి పత్రాలు అందించనున్నారు. ఎన్నికలకు ముందు కూటమి... తాము అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు విస్మరించింది. ధరలు మరింతగా పెంచడం ద్వారా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం మోపడంతోపాటు రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement