కృష్ణమ్మ గర్భాన చారిత్రక సౌందర్యం | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ గర్భాన చారిత్రక సౌందర్యం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

కృష్ణమ్మ గర్భాన చారిత్రక సౌందర్యం బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జున కొండ

నేడు అంతర్జాతీయ మ్యూజియం డే కృష్ణానది దీవిలో అపురూప దృశ్యం

మహాచైత్యం

బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జున కొండ

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయం మధ్య ఉన్న నాగార్జునకొండ మ్యూజియంకు ఎనలేని ప్రశస్తి ఉంది. వేసవిసెలవుల్లో ప్రతి విద్యార్థితో పాటు పెద్దలు విజ్ఞానం.. విహార యాత్రలో భాగంగా బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జున కొండను సందర్శించాల్సిందే. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం ఎందరో యాత్రికులు అనునిత్యం నాగార్జునకొండను సందర్శిస్తారు. చైనా, టిబెట్‌, శ్రీలంక తదితర దేశాల వారైతే ఇక్కడి తథాగతుని ప్రతిమకు ప్రార్థనలు జరుపకుండా వెనుకకురారు. ప్రపంచంలోనే మానవ నిర్మిత ఐలాండ్‌ మ్యూజియంలలో రెండవదయిన ఈమ్యూజియం విశిష్టత క్లుప్తంగా...

ఇక్ష్వాకుల రాజధాని

పూర్వం మహాయాన బౌద్ధ ప్రవక్త అయిన ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. బుద్ధదంత ధామమయమైన మహాస్థూపం, విశాలమైన వివిధ భిక్షువిహారాలు ఉన్నాయి. వీటన్నింటితో ఇక్ష్వాకుల రాజధానిగా విలసిల్లిన విజయపురి ప్రాంతం నాగార్జునసాగర్‌ డ్యాం నిర్మాణ సమయంలో ముంపునకు గురి కాకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు అక్కడ విశేష సామగ్రిని పరిరక్షించి నేడు నాగార్జున కొండలో ప్రదర్శిస్తున్నారు. నాగార్జునకొండ మ్యూజియంలో నాగార్జునకొండ లోయలో బౌద్ధ శిధిలావశేషాలు, ఇక్ష్వాకుల విజయపురి శిథిలాలు ఏవిధంగా పొందుపర్చారో వాటిని అదేవిధంగా పునర్నిర్మించారు. ఈమ్యూజియంలో మహాస్థూపంపై ఏర్పాటు చేసిన శిలా శిల్ప ఫలకాలు, ఆయకాస్తంభాలు, వివిధ విహారాలు, విశ్వవిద్యాలయాల్లోను లభించిన ఫలకాలను బుద్ధవిగ్రహాలను జాతక కథ క్రమాలను, బుద్ధచరిత్రాంశ శిల్పాలను తదితర వస్తు సామాగ్రిని క్రమపద్ధతిలో అందంగా పొందుపరిచారు. ఇక్ష్వాకు వంశీయుల శిలాశాసనాలు,వారి జీవిత విశేషాలు బౌద్ధస్తంభాలు తదితర మైనవి కూడా ఈమ్యూజియంలో ఉన్నాయి.

నాటి విశ్వవిద్యాలయానికి మచ్చుతునక అనుపు

ఈవిశ్వవిద్యాలయం శిథిల అవశేషాలు నాగార్జునకొండలోయలో ఏవిధంగా ఉన్నాయో అదే విదంగా ఆ ఇటుకలతోనే అనుపు వద్ద అమర్చారు. కష్ణానదితీరాన విశాలమైన విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొని ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులమై గురుశిష్య నివాసాలు ఒకేదగ్గరుండి సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమైన సయస్త విద్యల్లో పేరుపొంది ప్రపంచఖ్యాతి గాంచింది.

స్నానఘట్టాలు

నాగార్జునకొండపై ఇక్ష్వాకు రాజసౌధ ప్రాంగణంలో కష్ణానదితీరం నానుకోని నిర్మించిన స్నానఘట్టాలు ఉండేవి. ఇవికేవలం స్నానాలకే కాక వస్తు సామగ్రిని నౌకలద్వారా రవాణా చేయడానికిగాను నావల రేవులుగా కూడా వాడి ఉంటారని భావిస్తున్నారు. ఈస్నాన వేదికలను నున్నని నాపరాళ్లతో పరచబడినవి. ఇక్కడ స్నానానికి ఎంతో సౌకర్యంగా ఉండేది.

హారతీ దేవాలయం

విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో హారతీ దేవాలయం దాని దిగువన చతురస్త్రాకారంలో ఒకపెద్ద సరస్సు ఉంది. దీనికి నలువైపుల మెట్లతో ఒడ్డు ప్రాంతాలున్నాయి. మెట్లతో గ్యాలరీల మాదిరిగా ఉండటంతో దీని క్రీడాప్రాంగణం వేరే ప్రాంతంలో బయల్పడి నందున ఆసంశయం తీరింది. హారతీ దేవాళయంలో ప్రవేశానికి ముందు ఈసరస్సులో స్నానమాచరించేవారు. ఆకాలంలో పిల్లలకు మశూచి వచ్చినా, దంపతులకు సంతానం లేకున్నా హారతీ దేవిని దర్శించి పూజలు చేసేవారని ప్రతీతి.

సింహళ విహారం

మహాచైత్యం పక్కన సింహళవిహార శిథిలాలున్నాయి. ఈవిహారంలో బుద్ధ విగ్రహాన్ని స్థాపించారు. సింహళీయులు, ఈవిహారంలో నివసించి, నాగార్జునకొండలో పలుకుబడి సంపాదించుకున్నారని ప్రతీతి. చాంతిసిరి ఈవిహారానికి ఎన్నోధానధర్మాలు చేసినట్లు చరిత్రద్వారా వెల్లడవుతుంది. ఇవేకాక ఇంకా కూర్మక్షతి కుండం, ఇక్ష్వాకు రాజసౌధాలు, సతీసహగమన ఘట్టం, ఇక్ష్వాకురాజులు అశ్వమేథ యాగశాల తదితర మైన కట్టడాలు కూడా నాగార్జునకొండలో ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి..

నాగార్జున కొండకు చేరడానికి నాగార్జునసాగర్‌ నుంచి ఏపీ వైపు నుంచి( రైట్‌బ్యాంకునుంచి), తెలంగాణ వైపు(హిల్‌కాలనీ నుంచి) లాంచీలు ఉంటాయి. లాంచీప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యాత్రికులు అక్కడ ఎక్కువ సమయం గడిపేందుకు వీలుండదు. లాంచీలు కేవలం గంట సమయం మాత్రమే కేటాయించడంతో అన్ని విశేషాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న యాత్రికులకు నిరాశే మిగులుతుంది. బుద్ధధాతువును సందర్శించే యోగం కూడా అందరికి లేదు. కేవలం వీఐపీలకు మినహా ఎవరికీ అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్ది యాత్రికులు అక్కడ ఉండే విధంగా వసతులు కల్పిస్తే కానీ నాగార్జునకొండ మ్యూజియం ఏర్పాటుకు ప్రయోజనం చేకూరుతుంది.

ఇది బుద్ధధాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈస్థూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సారానాథ్‌లో ఉంచి పూజిస్తున్నారు. ఇది శారీరక స్థూపాల జాతికి చెందినది. దీని అంతర్భాగంలో బుద్ధభగవానుని అస్థికలు అమర్చబడ్డాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రము దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మించి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్థూపాకారాన్ని తయారు చేసి ఉపరితలాన్ని చుట్టుపక్కల పాలరాతి పలుకలు కప్పి అర్థగోళాకారంగా అందంగా నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement