పొన్నూరు: మండలంలోని మామిళ్ళపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు సోమవారం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు జోగి రమేష్ విచ్చేస్తున్నారని పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడలో ప్రబలిన డయేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు వైద్యాధికారులు ఆదివారం ప్రకటించారు. స్థానిక తెలుగు బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు ఒక్క డయేరియా కేసు కూడా రాలేదని వైద్యాధికారులు తెలిపారు. జ్వరం కేసులు మాత్రం నాలుగు వచ్చినట్లు వివరించారు. అస్వస్థతకు గురైన బాధితులందరూ పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వారికి మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లును అందజేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు. చేబ్రోలు, వేజండ్ల, పరిసిర ప్రాంతాలకు చెందిన వైద్యాఽధికారులు, సిబ్బంది వైద్య సేవలు అందజేశారు. వట్టిచెరుకూరు, చేబ్రోలు ప్రాంతాలకు చెందిన రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు. పరిస్థితి సాధారణ స్థితికి రావటంతో సోమ, మంగళవారాల్లో మెడికల్ క్యాంపును తీసివేసే అవకాశం ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
ఇంకొల్లు(చినగంజాం): ఆటో హ్యాండిల్ అదుపు తప్పడంతో పంట కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి ముసలయ్య (58) తన ఆటోలో ఒంగోలు నుంచి ఇంకొల్లు గ్రామానికి కొబ్బరి బొండాల లోడుతో వస్తున్నాడు. మరికొద్ది సేపట్లో ఇంకొల్లు చేరుకునే క్రమంలో కొణికి గ్రామం దాటిన తరువాత అతని ఆటో హ్యాండిల్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో ముసలయ్య ఆటోను నియంత్రించలేకపోవడంతో ఆటో పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో నీటిలో బోల్తా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 30 ఏళ్లుగా ముసలయ్య ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జీ సురేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి పోస్టుమార్టం నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు.
ముగ్గురికి తీవ్రగాయాలు
కారంచేడు: ఆటోను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన ఒక కుంటుంబ ఆటోలో ఏడుగురితో కలిసి పల్నాడు జిల్లా కోటప్పకొండ దైవ దర్శనం కోసం చేసుకొని తిరిగి చీరాల వస్తున్నారు. ఈ క్రమంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వస్తున్న కారు కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది చీరాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
చీరాల: చీరాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. స్థానిక జయంతిపేటకు చెందిన వాసిమళ్ల హరీష్ చీరాల ఆర్టీసీ డిపోలో హైర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌లోకి వస్తుండగా చీరాల మండలం కీర్తివారిపాలేనికి చెందిన చుక్క సుబ్రహ్మణ్యం, ఏలిక రమేష్‌లు హరీష్ వద్దకు వచ్చి ఒక మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందనే నెపంతో తనను చంపాలని ఉద్దేశంతో తనతో గొడవపడ్డారన్నారు. ఈ క్రమంలో ఇరువురు కులం పేరుతో దూషించారని, రమేష్ తనను కిందకు పడవేయగా సుబ్రహ్మణ్యం కత్తితో కడుపులో పొడిచారన్నారు. చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అవుట్‌పోస్టు పోలీసులు క్షతగాత్రుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.


