ఈ ఏడాది ప్రకృతి సేద్యం లక్ష్యం 82 వేల ఎకరాలు
70 వేల మంది రైతుల భాగస్వామ్యం
ఆఫీసుల్లో, పెరట్లో నూట్రీ గార్డెన్స్.. స్థలం లేకుంటే టెర్రస్ గార్డెన్స్
కలెక్టరేట్ నుంచే పీఎండీఎస్ శ్రీకారం..
ఖరీఫ్‌కు ముందే వీటిపై ప్రత్యేక శిక్షణ, జీవామృతాల మెలకువలు
యడ్లపాడు: ఆధునిక జీవనశైలిలో మనిషి ఆరోగ్యం రసాయనాల కోరల్లో చిక్కుకుంటోంది. పళ్లెంలో వడ్డించే ప్రతి ముద్దా విషతుల్యమవుతున్న తరుణంలో ప్రత్యామ్నాయం ప్రకృతి సాగు విధానమే శరణ్యం. పల్నాడు జిల్లాలోని 527 గ్రామాల్లో ఇప్పటికే 396 గ్రామాల్లో ప్రకృతి సేద్యం వైపు రైతుల అడుగులు పడ్డాయి. జిల్లాలోని 348 రైతు సేవా కేంద్రాలలో 240 కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉండగా, మిగిలిన వాటిలో వ్యవసాయ, ఉద్యాన సహాయకులు అందుబాటులో ఉన్నారు. వీరు ఘన, ద్రవ జీవామృతాల తయారీపై ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపే రైతులకు మెలకువలు నేర్పుతున్నారు. రసాయనాల్లేని ఆహారమే అసలైన అమృత భాండాగారమని భావించిన జిల్లా యంత్రాంగం ఒక బృహత్తర సంకల్పంతో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. కేవలం పొలాల్లోనే కాకుండా, ప్రతి ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంతో పాటు ఇంటి పెరటిని ఒక పోషక విలువల వనంగా(న్యూట్రీ, టెర్రస్ గార్డెన్) మార్చడమే ధ్యేయంగా ప్రణాళిక చేస్తోంది.
ప్రకృతి సాగు జిల్లా లక్ష్యం..
జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని కలెక్టర్ కృతికా శుక్లా కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది 82,598 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణాన్ని చేపట్టాలని ఆ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సుమారు 70 వేల మంది రైతులను ఈ విధానంలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళిక చేసింది. వివిధ రకాల పంటలను కేవలం ప్రకృతి పద్ధతుల్లో చేసేలా వారిని చైతన్యం చేయనుంది. ఖరీఫ్ సీజన్‌కు ముందుగా పీఎండీఎస్ సాగుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకృతి సాగులో కీలకమైన పీఎండీఎస్‌కు 30 రకాల విత్తనాలతో కూడిన 32 వేల విత్తనగుళికలను తయారు చేసి ఆయా కిట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిని జిల్లాలోని 28 బయోరీసోర్సు ఇన్‌న్‌ఫుట్ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రకృతి ఎరువులు, కషాయాల తయారీపై అవగాహన పెంచేందుకు మండలస్థాయి ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి ఈ శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


