ప్రజలపై ఇంధన భారం | - | Sakshi
Sakshi News home page

ప్రజలపై ఇంధన భారం

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 3 పెంపు ఇప్పటికే గృహావసరాల సిలిండర్‌పై రూ. 60 వడ్డన వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.1,370 అదనం మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు విఫలం

సత్తెనపల్లి: పేద, సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. యుద్ధం బూచిగా ఇంధన ధరలు పెంచడంతోపాటు జేబులు గుల్లవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి వంటింటి బడ్జెట్‌ తలకిందులైంది. ఇప్పుడు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచడంతో ఆ ప్రభావంతో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతలో ఒక్కసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్‌ లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచేసింది. ఖర్చుల భారం కన్నీళ్లు పెట్టిస్తున్నా చంద్రబాబు సర్కారు ధరల నియంత్రణకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాలకుల తీరుపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

నిత్యావసర సరుకులదీ అదే దారి

నూనెలు సలసల కాగుతున్నాయి. పామాయిల్‌ కిలో రూ. 110 నుంచి రూ. 130కి పెరిగింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ. 155 నుంచి రూ. 174, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ రూ. 130 నుంచి రూ.160కి చేరింది. కిలో కందిపప్పు రూ.100 నుంచి రూ.120, పెసరపప్పు రూ.90 నుంచి రూ.120, మినపగుళ్లు రూ.105 నుంచి రూ.120, పంచదార రూ.42 నుంచి రూ.46, వెల్లుల్లి రూ.160 నుంచి రూ.220కి పెరిగింది. రెండు నెలల వ్యవధిలో అన్ని రకాల సరకుల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. దీనికి తోడు చికెన్‌ ధర కిలో ఏకంగా గడిచిన కొన్ని వారాల్లో రూ. 250 నుంచి రూ. 324కు పెరిగింది. పాల ప్యాకెట్లు, పెరుగు, మజ్జిగపైనా ఆయా కంపెనీలు రూ.ఒకటి – రూ.రెండు వరకు పెంచేశాయి. ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో ఆ భారం ఇంకా ఎక్కువగా ప్రజలపై పడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement