బైకును కళాశాల బస్సు ఢీకొని ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

బైకును కళాశాల బస్సు ఢీకొని ఇద్దరు మృతి

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

బైకును కళాశాల బస్సు ఢీకొని ఇద్దరు మృతి

నాదెండ్ల: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సాతులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు టైరు పేలి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఆర్‌. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన వేమూరి అశోక్‌ (35) వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. ఇదే గ్రామానికి చెందిన జమ్ముల సీతారామయ్య (22) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై నరసరావుపేటలోని ఓ హోటల్‌ నుంచి పార్శిల్‌ తీసుకుని పొనుగుపాడుకు బయలుదేరారు. సాతులూరు సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్దకు రాగానే ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు టైరు పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఒకరు బస్సు టైరు కింద పడి మృతి చెందగా, మరొకరిని బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ జె. నిరంజన్‌, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ పారిపోయాడు. బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement