సత్తెనపల్లి: విద్యుత్ షాక్‌కు గురై యువ రైతు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం గోగులపాడు గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోగులపాడు గ్రామానికి చెందిన యువ రైతు తన్నీరు వెంకటేశ్వర్లు (26) గురువారం తనకు చెందిన 2.50 ఎకరాల పొలంలో పచ్చిక కోసం వాగులో నీటిని తన పొలానికి మళ్లించేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా షాక్‌కు గురై సమీపంలోని వాగు నీటిలో పడి పోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు గమనించి తన్నీరు వెంకటేశ్వర్లను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య భూలక్ష్మి, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణా కేసులో మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: గుంటూరులో నివాసం ఉంటూ వివిధ ప్రాంతాల చిరునామాలను ఉపయోగించుకుంటూ అక్రమంగా గంజాయిని రవాణా చేసి విక్రయిస్తున్న మద్దు రామకృష్ణయ్య గంజాయి అక్రమ రవాణా కేసులో మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. కేసు వివరాల ప్రకారం, రేపల్లె వైపు ప్రయాణిస్తున్న ఒక ఆటోలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న సంచిలో సుమారు రెండు కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిపై ఆధారాలతో రేపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించి, విచారణ అనంతరం నిజనిర్ధారణ చేసిన మొదటి అదనపు జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి ముద్దాయి మద్దు రామకృష్ణయ్యకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.20 వేల జరిమా నా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.అశోక వాణి వాదనలు వినిపించారు.
మాస్టర్ ఆఫ్ సైన్స్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో జరిగిన మాస్టర్ ఆఫ్ సైన్స్ పస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణా ధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 28వ తేదీ లోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.


