అక్రమ వసూళ్లను నిరసిస్తూ రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అక్రమ వసూళ్లను నిరసిస్తూ రైతుల ఆందోళన

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

నాదెండ్ల: మైనింగ్‌ శాఖకు చెందిన ఏఎంఆర్‌ కంపెనీ చెక్‌పోస్టు సిబ్బంది రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు, ట్రాక్టర్‌ డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. సాతులూరు వద్ద గుంటూరు–కర్నూలు రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని చందవరం సెంటర్‌లో ఉన్న ఏఎంఆర్‌ కంపెనీ చెక్‌పోస్టు సిబ్బంది రైతులు, ట్రాక్టర్‌ డ్రైవర్‌లను వేధిస్తున్నారని విమర్శించారు. రైతులు తమ పొలాల్లో మెరక మట్టిని తోలుకుంటున్నారని, ట్రాక్టర్‌కు రూ.500 చెల్లించాలంటూ రైతులపై ఏఎంఆర్‌ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. గ్రామంలోని ఓ మహిళ తన పొలంలోని మెరక మట్టిని ట్రాక్టర్లలో ఇతర పొలాలకు తోలించిందని, అందుకు ఏఎంఆర్‌ సిబ్బంది అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చెల్లించాల్సిందేనంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. డబ్బులు చెల్లించకుంటే కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్‌ సంస్ధ నుండి రైతులను కాపాడాలని, ఈ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుని చెక్‌పోస్టును తొలగించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, ట్రాక్టర్‌ డ్రైవర్ల ఆందోళనతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ జె నిరంజన్‌, నరసరావుపేట రూరల్‌ సీఐ సుబ్బరావు, నాదెండ్ల, నరసరావుపేట రూరల్‌ ఎస్సైలు ఆర్‌ వెంకటేశ్వరరావు, కిశోర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏఎంఆర్‌ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement