170 కేజీల రాగి తీగ స్వాధీనం గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ వెల్లడి
మాచవరం: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి వాటిలో ఉన్న రాగి తీగను దొంగిలించిన సంఘటనలో ఐదుగురు నిందితులతోపాటు, వాటిని కొనుగోలు చేసిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు లక్ష్యంగా చేసుకొని తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఓ ముఠా ఈ చోరీలకు పాల్పడుతుందని వెల్లడించారు. మాచవరం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వేముల ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం మండలంలోని గోవిందపురం బల్లకట్టు వద్ద కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా రాగి తీగలను దొంగతనం చేసే వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో మొలిక ముత్యం, ఏ గసిరి కోటయ్య , పెండ్ర , వెంకటేష్ కట్టా వెంకటేశ్వర్లులు ఉన్నారు. వీరు దొంగిలించిన రాగి తీగను మంగళగిరి ప్రాంతానికి చెందిన బత్తుల తారకేశ్వరరావు, వారణాసి సతీష్‌లకు విక్రయిస్తున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 20 కేసుల్లో సుమారు 85 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి దొంగిలించిన 350 కిలోల రాగి వైర్‌కుగాను 170 కిలోల రాగి వైర్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు దొంగతనానికి గురైనట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. నిందితులను అరెస్టు చేసిన మాచవరం ఎస్సై పవన్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.
గుంటూరు రూరల్: ఇటీవల కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవ వేడుకల్లో విజ్ఞాన్ నిరులా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐటీ విభాగ విద్యార్థిని గుండా ప్రియాంకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం విశేష గౌరవంగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థిని అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ గుండా ప్రియాంక తన కృషి, పట్టుదల, అంకితభావంతో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని సంస్థకు మరింత ఖ్యాతిని తీసుకువచ్చిందన్నారు. ఆమె సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ప్రియాంకను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.ఎస్. రామకృష్ణ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.


