బతికిస్తే.. బడికి పోతా..! | - | Sakshi
Sakshi News home page

బతికిస్తే.. బడికి పోతా..!

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

● కామెర్ల వ్యాధితో చిన్నారి కీర్తనకు దెబ్బతిన్న లివర్‌ ● లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ చేస్తేనే బతికే అవకాశం ● అప్పోసొప్పో చేసి ఇప్పటికే రూ.4లక్షలు ఖర్చు చేసిన పేద తల్లిదండ్రులు ● తమ బిడ్డను బతికించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు వినతి

నరసరావుపేట రూరల్‌: కామెర్ల వ్యాధితో లివర్‌ దెబ్బతిన్న తన ప్రాణాలు కాపాడితే బడికెళ్లి చదువుకుంటానంటూ చిన్నారి కీర్తన అధికారులను వేడుకొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ పాపను కాపాడాలని నూజెండ్ల మండలం కంభంపాడుకు చెందిన పల్లపాటి వీరయ్య, మరియకుమారి దంపతులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజన సింహాను కోరారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీని కలిసి ఈమేరకు వారు వేడుకున్నారు. కీర్తన ప్రస్తుతం నాల్గవ తరగతి చదువుతున్నట్టు తల్లిదండ్రులు జాయింట్‌ కలెక్టర్‌కు తెలిపారు. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డకు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.4లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిపారు. కామెర్ల వ్యాధితో లివర్‌ దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యులు సూచించారని తెలిపారు. పరీక్షించిన అక్కడి వైద్యులు లివర్‌ మార్పిడి కోసం రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారని, అంత డబ్బులు పెట్టి వైద్యం అందించే స్థోమత తమ దగ్గర లేదన్నారు. ఎంతమంది దగ్గరకు తిరిగినా తమకు సహాయం అందడం లేదన్నారు. ప్రభుత్వం కీర్తన వైద్యానికి అయ్యే ఖర్చులు భరించాలని కోరారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు దాతలు స్పందించి సహకరించాలని వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement